
బిహార్ బరిలో: నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్
విశ్లేషణ
పండుగల సమయంలోనూ బిహార్ రాజకీయాలలో మునిగితేలుతుంది. బిహా రీలకు రాజకీయాలకు మించిన కాలక్షేపం లేదు. బిహార్ శాసన సభ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగ నున్న నేపథ్యంలో ఎన్నికల పండుగ మొద లైపోయింది.
నితీశ్ కుమార్ ఎక్కడుంటే అధికారం అక్కడేనని గడిచిన రెండు దశాబ్దాలలో బిహార్‌లో ఒక కొత్త నానుడి రూపుదిద్దు కుంది. పొత్తు పెట్టుకున్న పార్టీలను దూరం పెట్టేదిగా బీజేపీ పేరు మోసినప్పటికీ, రాష్ట్రంలో అది జూనియర్ భాగస్వామిగా సంతృప్తి పడటానికి బహుశా అదే కారణం. నితీశ్ నేతృత్వంలోని జేడీ (యు)తో పొత్తు పెట్టుకున్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నాయక త్వంలోని ఆర్జేడీ కూడా అదే రకమైన సంకట స్థితిని ఎదుర్కొంది.
నితీశ్ సరసన లేని ఏ పార్టీ అయినా, ఆయనపై విషం చిమ్మడం ఖాయం. అయినప్పటికీ, ఆయనతో అంటకాగాలని రహస్యంగా కోరుకుంటాయి. లాలూ 2022లో నితీశ్‌తో చేతులు కలపడానికి ఇదే కారణం. 2017లో చీలిక చేదును మిగిల్చినా లాలూ దాన్ని దిగ మింగుకోవాల్సి వచ్చింది. మహాఘట్ బంధన్ రెండు విడతల హయాంలో నితీశ్‌తో ఎన్నడూ పొత్తు పెట్టుకోమని బీజేపీ నాయ కులు బాహాటంగా ప్రతిన బూనారు. కానీ తమ ‘సహజ భాగ స్వామి’తో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
నితీశ్ బలాబలాలు
గతంలో బిహార్‌లో ఎన్నికల విజయాన్ని నితీశ్ ఎలా సొంతం చేసుకున్నట్లు? నితీశ్ 2005లో బిహార్ సీఎం అయినపుడు తన శక్తి యుక్తులన్నింటినీ శాంతి భద్రతల నిర్వహణపై కేంద్రీకరించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, రవాణా, విద్యా రంగాలు మెరుగుపడ్డాయి. స్కూళ్ళలో అడ్మిషన్లను, హాజరును పెంపొందించేందుకు ఆయన 2006లో ‘స్కూల్ చలో అభియాన్’ ప్రారంభించారు. బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. అలా 2005లో ఒక మౌన విప్లవం మొదలైంది. రాష్ట్రంలో 2005లో కేవలం 1.8 లక్షల మంది బాలికలు 10వ తరగతి పరీక్షకు కూర్చుంటే, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయ బోతున్న 15.85 లక్షల మంది విద్యార్థులలో సగంపైగా బాలికలే.
ప్రతి ఒక్కరికీ ఇల్లు, తాగునీటి సదుపాయం కార్యక్రమాన్ని నితీశే మొదట ప్రారంభించారు. కానీ, అంతగా సఫలీకృతులు కాలేక పోయారు. రాష్ట్రం నుంచి జనం ఇప్పటికీ వలస పోతూనే ఉన్నారు. అనేక మానవ, అభివృద్ధి సూచికలలో బిహార్ అట్టడుగున ఉంది. నితీశ్ మూడవ, నాల్గవ విడత పాలన అనేక కారణాల రీత్యా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి నితీశ్ వివిధ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్య స్థితి కూడా నిశిత పరిశీలనకు గురవుతోంది. ఈ కారణంగానే, ఈసారి నితీశ్ ప్రభుత్వం కోటి మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 చొప్పున నగదు జమ చేసింది. రకరకాల రాయితీలను, వరాలను ప్రకటించింది.
తేజస్వి ప్లస్ కూటమి
నితీశ్ ప్రధాన ప్రత్యర్థి తేజస్వి యాదవ్, గత ఎన్నికల్లో అద్భు తమైన ఫలితాలు సాధించారు. ఆయన మహాఘట్ బంధన్ కేవలం 16,825 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్, వామ పక్షాలు ఇప్పటికీ ఆయనకే మద్దతు ఇస్తున్నాయి.
కాంగ్రెస్ ఓట్ల పునాదికి కోత పడినప్పటికీ, రాహుల్ గాంధీ తన యాత్రలో తేజస్విని పటిష్ఠపరచేందుకు ప్రయత్నించారు. మొత్తం ప్రతిపక్షమంతా తేజస్వి వెనుకనే నిలిచిందని చాటేందుకు దీపాంకర్ భట్టాచార్య (వామపక్షం), అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), సంజయ్ రౌత్ (శివసేన), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సొరేన్ (జేఎంఎం), యూసుఫ్ పఠాన్ (తృణమూల్ కాంగ్రెస్) ఆయన యాత్రలో పాల్గొన్నారు. అయితే, ఆయన సహచరుల,సొంత కుటుంబ సభ్యుల మితిమీరిన ఆశలు పెను సవాలును విసురుతున్నాయి.
ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కొత్త ఓటర్ల జాబితా 69 లక్షల ఓటర్ల తొలగింపును, 21 లక్షల మంది పేర్ల కొత్త జోడింపును చవి చూసింది. మహాఘట్ బంధన్ కొన్ని నెలలుగా దాన్నొక రాజకీయ అంశంగా మారుస్తూ వస్తోంది. సీట్ల పంపకంపై ప్రస్తుతం మహా ఘట్ బంధన్‌లో బురద జల్లుకునే కార్యక్రమం సాగుతోంది. ఇది ప్రతిసారీ కనిపించేదే. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలసి పోటీ చేయడం మాత్రం ఖాయం.
పీకే ప్రభావం
ప్రశాంత్ కిశోర్, ఆయన ‘జన్ సురాజ్’ పార్టీ మరో ప్రభావిత అంశం కానుంది. ఆయన గతంలో, 2014 ఎన్నికలకు ముందు బీజేపీకి ఎన్నికల నిర్వహణ సేవలందించారు. తదనంతరం,కాంగ్రెస్, వైసీపీ, తృణమూల్, ఆప్, డీఎంకేలతో పాటు, చివరకు నితీశ్ కుమార్‌కు కూడా సేవలందించారు.
రాష్ట్రంలో ఈ విడత ఎన్నికల సందర్భంగా, ప్రతి జిల్లాలోనూ ప్రశాంత్ కిశోర్ పాదయాత్రలు చేశారు. గత ఏడాదిగా ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి ప్రజలతో నేరుగా సంభాషించారు. రాత్రిపూట గ్రామాల్లోనే బస చేశారు. నితీశ్, బీజేపీ, ఆర్జేడీలపై సమానంగా విమర్శలు గుప్పించారు. ఆయన పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన పార్టీకి నిధుల కొరత కూడా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడే పక్షంలో కింగ్ మేకర్‌గా మారతారా? విజ యానికి పెద్ద సంఖ్యలో జన వాహినులు, ఆకర్షణీయమైన నినా దాలు అవసరమేగానీ, అవి విజయానికి పూచీ నివ్వలేవు.
బీజేపీ గురించి కూడా ముచ్చటించుకుందాం. ఈ కాషాయ పార్టీకి అద్భుతమైన సంస్థాగత బలం ఉంది. కుల సమీకరణలు కూడా దానివైపు పటిష్ఠంగా ఉన్నాయి. జేడీ(యు)తోపాటు, చిరాగ్ పాశ్వాన్, జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుశ్‌వాహ ఎన్డీయేను తిరుగులేని కూటమిగా నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో, జేడీ (యు)తో పోల్చుకుంటే బీజేపీ రెట్టింపు సీట్లకు పైగా గెలుచుకున్నా, ముఖ్యమంత్రిగా తమ అభ్యర్థే ఉండాలని పట్టుబట్టలేదు. విశ్వస నీయమైన ముఖం ఏదీ లేకపోవడం దాని బలహీనత. ఈ అంశంపై ఇప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లోనైనా ఆ పార్టీ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు.
బిహార్ ఒక ఆసక్తికరమైన దశలోకి అడుగిడుతోంది. చివరి నిమిషం వరకు అంతిమ ఫలితం నిర్ణయం కాదని గత అసెంబ్లీ ఎన్నికలు సూచిస్తున్నాయి. ఎన్నికల సంరంభపు హడావిడి సద్దుమణగి,అంతిమ సంఖ్యా బలాలు వెల్లడైన తర్వాత, అసలు క్రీడ ఆరంభం కాబోతోంది.
శశి శేఖర్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
(‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)