
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హైలెవిల్ సీసీఎస్ సమావేశం జరిగింది. పలువురు కీలక కేబినెట్ మంత్రులతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాక్ లోని ఉగ్రస్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే వరుసగా సీసీఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ.
గత 20 రోజుల్లో సీసీఎస్ భేటీ కావడం ఇది ఐదోసారి. అయితే భారత్-పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన తర్వాత సీసీఎస్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కేబినెట్ ప్రశంసించింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పారని మోదీని అభినందించింది. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని కేబినెట్ కొనియాడింది.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది.