
మార్కుల వేటలో తల్లిదండ్రులు
నగరాల్లోనే ఈ ధోరణి అధికం
ప్రైవేటు విద్యకే ఎక్కువగా మొగ్గు
కోచింగ్‌కు రెండింతల వ్యయం
పాఠశాల విద్యార్థుల్లో దాదాపు నలుగురిలో ఒకరు ఇప్పుడు ట్యూషన్లు లేదా ప్రైవేట్ కోచింగ్ మీద ఆధారపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంది. ట్యూషన్ల కోసం ఏటా ప్రతి విద్యార్థిపై చేస్తున్న సగటు వ్యయం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండింతలు అధికంగా ఉండడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్
జాతీయ నమూనా సర్వే (ఎన్స్ ఎస్‌ఎస్) 80వ రౌండ్ కింద కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్–జూన్ మధ్య విద్యపై సమగ్ర సర్వే చేపట్టింది. అడ్మిషన్ల విషయంలో గ్రామీణ భారతంలో ప్రభుత్వ పాఠశాలలదే పైచేయిగా ఉందని సర్వే తేల్చింది. పట్టణ ప్రాంత కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నాయి అంతేకాదు మార్కుల వేటలో భాగంగా తమ పిల్లలను ట్యూషన్లకూ పంపిస్తున్నాయి.
ట్యూషన్ల కోసం వ్యయం
ప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలో 27 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో 30.7%, గ్రామీణ భారత్‌లో 25.5% మంది ప్రైవేట్ కోచింగ్‌పై ఆధారపడ్డారు. దేశంలో సగటున ఒక్కో విద్యార్థి ట్యూషన్స్ కోసం రూ.2,409 వెచ్చిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ కోసం సగటు ఖర్చు రూ.1,793 కాగా, పట్టణాల్లో రూ.3,988 అవుతున్నట్టు అంచనా. ఇంటర్ స్థాయిలో పట్టణ కుటుంబాలు కోచింగ్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.9,950 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.4,548.
పట్టణాల్లో ప్రైవేట్ విద్యకు..
గ్రామీణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 33.9% మంది ప్రైవేట్, ఇతర సంస్థలలో చదువుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 30.1% మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 70% మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. మొత్తంగా దేశ సగటు చూ స్తే.. అడ్మిషన్లలో 55.9% వాటా ప్రభుత్వ పాఠశాలలదేనని సర్వే పేర్కొంది.
పట్టణ ప్రాంతాల్లో అధికం
ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. కానీ, ట్యూషన్లు, ర వాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రైవేటులో అయితే వీటికి ఫీజు, యూనిఫాం వంటివి అదనంగా చేరతాయి. దీంతో ప్రతి విద్యా ర్థికి అవుతున్న వార్షిక వ్యయం రూ.23,470గా సర్వే అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.8,382గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే.. పట్టణ ప్రాంత విద్యార్థికి రూ.4,128, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,639 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల విషయంలో ఇది.. పట్టణప్రాంతాల్లో రూ.31,782, గ్రామీణ ప్రాంతాల్లో 19,554గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఫీజుల కోసం చేస్తున్న సగటు వార్షిక వ్యయం రూ.15,143 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,979.
⇒ ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల విషయంలో దేశంలో 37% మంది ప్రైవేట్ కోచింగ్‌కు సై అంటున్నారు. పట్టణాల్లోని ఇంటర్ స్టూడెంట్స్‌లో 44.6 మంది ట్యూషన్లకు వెళ్తున్నారు.
⇒ ప్రైవేట్ ట్యూషన్స్ కోసం దేశంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు సగటున ఏటా రూ.6,384 ఖర్చు పెడుతున్నారు.
⇒ కోచింగ్ సంస్థలు చెల్లించిన వస్తు, సేవల పన్ను 2019–20లో రూ.2,240 కోట్లు. 2023–24కి వచ్చేసరికి ఇది రూ.5,517 కోట్లకు చేరింది.
⇒ కోచింగ్ కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఏటా అమ్మాయిలు రూ.2,227, అబ్బాయిలు రూ.2,572 వ్యయం చేస్తున్నట్టు సర్వే పేర్కొంది.