న్యూఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్రహింసకు స్కెచ్ వేసిన జైషే మహ్మద్ ఉగ్రకుట్రను ఓ చిన్న పోస్టర్ ద్వారా భగ్నం చేయడం విశేషం. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసిన జైషే మహ్మద్ పోస్టర్లను నెల క్రితమే ఓ పోలీసు అధికారి గుర్తించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఫలితంగా దేశాన్ని పెను విధ్వంసం నుంచి కాపాడగలిగారు. ఈ ఘనత సాధించిన అధికారి మన తెలుగువారే కావడం గర్వకారణం.
తెలుగు ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి, జైషే మహ్మద్ కుట్రను ఛేదించి తన శౌర్యాన్ని చాటారు. ఇప్పటికే ఆరు సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం అందుకున్న ఆయన, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. ఇది ఆయనకు ఆరో అవార్డు కావడం విశేషం.
పోస్టర్‌తో బండారం బట్టబయలు
2019 వరకు కాశ్మీర్‌లో ఉగ్రసంస్థలు సైనిక అధికారులను బెదిరిస్తూ పోస్టర్లు వేయడం సాధారణంగా జరిగేది. కానీ ఆర్మీ అప్రమత్తతతో ఆ కార్యకలాపాలు తగ్గాయి. అయితే, గత నెలలో శ్రీనగర్‌లో రహస్యంగా తరలిస్తున్న జైషే మహ్మద్ పోస్టర్లను ఐపీఎస్ సందీప్ గమనించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ తెప్పించి, ముగ్గురు యువకులు పోస్టర్లు తరలిస్తున్న దృశ్యాలను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా, షోపియాన్‌కు చెందిన మత గురువు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఆధ్వర్యంలో జైషే కుట్ర జరుగుతున్నట్లు వెల్లడైంది.
ఉగ్రవాదుల అరెస్టు..పేలుడు పదార్థాల స్వాధీనం
విచారణలో జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు స్కెచ్ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్లుగా పనిచేస్తున్న ముజమ్మీల్ షకీల్, అదీల్ అహ్మద్, లక్నోకు చెందిన షాహీన్ సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలు, అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్, అలాగే రెండు AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మరో డాక్టర్ ఉమర్ పరారీలో ఉండగా, అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
సందీప్ చక్రవర్తి ప్రస్థానం
కర్నూలులో జన్మించిన సందీప్ చక్రవర్తి, మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్‌లో విద్యనభ్యసించి, మెడిసిన్ పట్టభద్రులయ్యారు. అనంతరం సివిల్స్‌లో ర్యాంకు సాధించి 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) గా సేవలందిస్తున్నారు. పూంచ్ ఏఎస్‌పీగా తన సర్వీసు ప్రారంభించిన ఆయన, హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు.
ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలు
సందీప్ ఇప్పటివరకు ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలు, నాలుగు జమ్మూ అండ్ కశ్మీర్ గ్యాలంట్రీ మెడల్స్, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహదేవ్‌లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.


