సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కూటమి ప్రభుత్వం గుండెల్లో గుబులు రేపిందని.. అది చూసి ఓర్వలేక మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్లెక్సీల మీద సినిమా డైలాగులు రాసినా కేసులు పెట్టారు. నల్లజర్లలో ఒక కార్యకర్తను నడిరోడ్డు మీద నడిపించారు. ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వతలచుకున్నారు?’’ అంటూ వనిత ప్రశ్నించారు.
‘‘రక్త తర్పణం చేసిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని హోంమంత్రి అనిత అంటున్నారు. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కడితే ఏం చేశారు?. ఆ రోజు జీవహింస, రాక్షస సంస్కృతి హోంమంత్రి అనితకు కనపడలేదా?. అసలు ఇలాంటి సంస్కృతిని తెచ్చిందే టీడీపీ. ఆ రోజే ఈ సంస్కృతిని ఎందుకు కట్టడి చేయలేదు?. మా వాళ్లపై పోలీసులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తానని హోంమంత్రి ఎలా అంటారు?. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అర్హత మీకు ఎవరిచ్చారు?. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారు?
..నల్లజర్ల సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తని నడిపిస్తారని టీటీపీ కార్యకర్తలు ముందుగానే పోస్టు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు పొట్టేళ్ల రక్తంతో తర్పణం చేస్తుంటే హోంమంత్రికి కనపడలేదా?. జగన్‌ని దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని హోంమంత్రి భావిస్తున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హోంమంత్రికి కనపడటం లేదు. రాజధాని రైతుల్లో కూడా తీవ్రమైన మార్పు వచ్చింది. తమను మోసం చేయటంపై రైతులు ప్రశ్నిస్తున్నారు
..దాన్ని డైవర్షన్ చేసేందుకు జీవహింస అంటూ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల విధ్వంసంపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అక్రమ చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జగన్‌పై నిత్యం విషం చిమ్మటమే పనిగా కూటమి నేతలు పెట్టుకున్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు. ఇలాంటి విష ప్రచారాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలంతా ధైర్యంగా నిలబడాలి. డిజిటల్ బుక్ లో అవన్నీ నమోదు చేయండి. అధికారం లోకి వచ్చాక తగిన విధంగా చర్యలు తీసుకుందాం’’ అని తానేటి వనిత చెప్పారు.


