సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఆర్బీఐ నిబంధనలను ఆ కంపెనీ ఉల్లంఘించిన అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని మాజీ ఎంపీ, అడ్వొకేట్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు గురువారం సూచింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఇవాళ వాదనలు వింది. వర్చువల్‌గా విచారణకు హాజరైన ఉండవల్లి ‘‘ఇది డిపాజిట్ల కలెక్షన్, పేమెంట్స్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందని.. దీనిపైన విచారణ జరగాలని’’ కోరారు. అయితే..
ఈ అంశాలన్నీ హైకోర్టు ముందున్న ప్రధాన పిటిషన్ విచారణ సందర్భంగా వినిపించాలని ఆయనకు ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం తాము కేసు మెరిట్ లోకి వెళ్లడం లేదని.. హైకోర్టు స్టే ఇవ్వనన్న అంశంపై మాత్రమే విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది.
ఇక.. ఈ కేసులో ఉండవల్లి అసలు ప్రతివాది కాదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ సమయంలోనూ తాము ఎలాంటి వ్యాఖ్యానం చేయదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తూ.. తాము చెల్లించాల్సిన 2,300 కోట్ల రూపాయల డిపాజిట్లలో సింహభాగం చెల్లించామని, ఎస్క్రో ఖాతాలో 5.43 కోట్ల రూపాయలు ఉన్నాయని.. డిపాజిట్ల మెచ్యూరిటీ ఆధారంగా వాటిని చెల్లించాలని కోరారు.


