సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే విడుదల చేయాలంటూ జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అణచివేత ధోరణిని కూటమి ప్రదర్శించడం చూస్తున్నదే. ఈ క్రమంలోనే యూరియా కొరతపై తారక్ ప్రతాప్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. ఈ పరిణామంలో రగిలిపోయిన ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. తారక్‌ను అక్రమ అరెస్ట్ చేయించింది. తారక్ తరఫున సుప్రీం కోర్టులో సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు.
‘‘యూనిఫాంలో కాకుండా మఫ్టీలో వైఎస్ఆర్సిపీ సోషల్ మీడియా కార్యకర్తలను కిడ్నాప్ చేస్తున్నారని.. ప్రభుత్వ దమనకాండపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని’’ వాదించారు. సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. తారక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.


