సాక్షి, అమరావతి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వైఎస్సార్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరిగింది. కోటి సంతకాల సేకరణ ప్రతులతో జరిగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీకి జనం పోటెత్తారు.
ప్రకాశం జిల్లా: రాష్ట్రంలోని వెనకబడి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి కూటమి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ మంజూరు చేసి, నిర్మాణం చేపడితే కడుపుమంటతో చంద్రబాబు ప్రైవేటీకరణ చేశారన్నారు. మార్కాపురం గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాల నుంచి వైద్యం కోసం ప్రజలు నేటికీ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణల ఉంటే పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం నియోజకవర్గంలో 85 వేల మంది సంతకాలు చేశారని అన్నా రాంబాబు తెలిపారు.
నంద్యాల జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి , కాటసాని రామిరెడ్డి , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ,ఇషాక్ భాషా , డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారు
అన్నమయ్య జిల్లా: జిల్లాలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ అయ్యింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయచోటిలో నినాదాలు హోరెత్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రజానీకం కదం తొక్కింది. ‘‘పేదలకు అండ వైఎస్ జగన్. కార్పోరేట్‌లకు అండ చంద్రబాబు. సీఎం డౌన్.. డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


