చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కుటుంబ కలహాలతో ఓ తల్లి కన్నకొడుకుతో మృత్యుఒడిలోకి చేరింది. ఈ ఘటన ఆదివారం చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... తుమ్మింద గ్రామానికి చెందిన బాబు భార్య కవిత్ర (26)కు అయిదేళ్ల కిందట వివాహం అయింది. ఈ దంపతులకు ముకేష్ (04) అనే కుమారుడు జన్మించాడు. శనివారం ఈ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత్ర సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో కుమారుడుతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది.
భార్య, కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు ఊరంతా గాలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఊరికి సమీపంలోని బావిలో శవమై తేలారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ తదితులున్నారు.


