సాక్షి, కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా.. అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మచిలీపట్నంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. సంతక పత్రాలతో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహించింది. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కోటి సంతకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైఎస్సార్‌సీపీ చెబుతోంది.
మచిలీపట్నంలో ప్రతులను తరలించే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు.. వైఎస్సార్‌సీపీ ఆఫీస్ నుంచి వాహనంలో బాక్సులను స్వయంగా పేర్ని నాని, ఇతర నేతలతో కలిసి ఎక్కించారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ దాకా భారీ ర్యాలీ జరిగింది.


