ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15) నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/J5uQWesAWJ
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు అయిన పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న నెల్లూరు జిల్లా పదమటిపల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ. సానిటరీ ఇంజినీరింగ్(Sanitary Engineering)లో చదువు పూర్తి చేశారాయన. 1928–1930 మధ్యలో భార్య, పిల్లలు, తల్లి మరణించడంతో ఉద్యోగాన్ని వదిలి గాంధీజీ ఆశ్రమంలో చేరారు.
స్వాతంత్ర్య పోరాటంలో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తిగత సత్యాగ్రహం.. ఉద్యమాల్లో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనలో అనేక సార్లు జైలుకు వెళ్లారు. దళితుల హక్కుల కోసం, ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్షలు చేశారు. పొట్టి శ్రీరాములు లాంటి వాళ్లు ముందు నుంచి ఉద్యమంలో ఉండి ఉంటే.. దేశానికి స్వాతంత్రం ఏనాడో వచ్చి ఉండేదని ఒకానొక సందర్భంగా గాంధీ కితాబిచ్చేవారు. అలాంటి మహనీయుడు..
తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్‌తో 1952 అక్టోబర్‌లో మద్రాస్‌లో నిరాహార దీక్ష ప్రారంభించారు. దాదాపు 58 రోజుల తర్వాత డిసెంబర్ 15వ తేదీన దీక్షలోనే మరణించారు. ఆయన త్యాగం తర్వాతే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అలా స్వరాష్ట్ర కలను సాకారం చేసి ‘‘అమరజీవి’’గా ఆయన కీర్తి దక్కించుకున్నారు.


