అనంతపురంలోని సాయినగర్‌లో మెడికల్ వ్యర్థాలను సేకరిస్తున్న పారిశుధ్య కార్మికులు
అనంతపురం క్రైం: మెడికల్ వేస్టేజ్ తరలింపులో పాటించాల్సిన నిబంధనలను అనంతపురంలోని ఏ ఒక్క ఆస్పత్రి పాటించడం లేదు. కాసుల కోసం జనం ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. చెత్తను కవర్‌లలో పెట్టి ఇవ్వాలని పారిశుధ్య కార్మీకులు చెబుతున్నా.. ‘నెలవారీ మామూళ్లు ఇస్తున్నాం కదా? మీరే జాగ్రత్తగా తీసుకెళ్లాలి’ అంటూ చెబుతున్నట్లు తెలిసింది. బయో మెడికల్ వేస్టేజ్ 2016 మార్గదర్శకాల ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల యాజమాన్యాలపై రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. అదే తప్పు పునరావృతమైతే రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించి అనుమతులు కూడా రద్దు చేయవచ్చు. క్రిమినల్ కేసులకు కూడా సిఫార్సు చేసే అవకాశం ఉండడం గమనార్హం.
పర్యవేక్షణ ఏదీ..?
నగరపాలక సంస్థ అధికారులు వారి విధులను మరచిపోయారు. నెలవారీ మామూళ్ల మోజులో పడి ప్రైవేటు ఆస్పత్రులపై అజమాయిషీ విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. 30 రోజుల మెడికల్ వేస్టేజ్ ఆడిట్, లైసెన్స్ లేని ఆస్పత్రుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం వారి అలసత్వానికి అద్దం పడుతోంది.
చాలా ప్రమాదం..
రోగికి వినియోగించిన ఇంజెక్షన్లు, రక్త నమూనాలు, సూదులు, క్యాన్యులాలు, రక్త పరీక్షల అనంతరం వచ్చే రక్త, మూత్ర నమూనాల కంటైనర్లు, శస్త్రచికిత్సలో మిగిలిపోయే పదార్థాలే బయోమెడికల్ వ్యర్థాలు. వీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లతో కేవలం రోగులకే కాదు, ప్రజలకు కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. తరలించే సమయంలో కార్మికుల చేతికి చిన్న సూది గుచ్చుకున్నా, చర్మంపై గీత పడ్డా హెపటైటిస్, హెచ్‌ఐవీ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకవచ్చు. ఈ క్రమంలో మెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా, ప్రైవేటు హాస్పిటల్స్ వాటిని పాటిస్తున్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
నగరంలో కొన్ని చోట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వ్యర్థాలను నిల్వ ఉంచడానికి డబ్బు చెల్లించాల్సి వస్తుందని, అధికారిక బయోమెడికల్ వాహనాల కోసం అదనపు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్పి తప్పించుకుంటున్నాయి. ఈ సమయంలో శానిటేషన్ కార్మికులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు డబ్బు కోసం కళ్ల మూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి నిబంధనలు అమలయ్యేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.


