పింఛన్ల నిలుపుదల చేయడంతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు (ఫైల్)
చంద్రబాబు.. హామీలు ఇవ్వడంలో చూపిన స్పీడు అమలులో కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పినా.. 19 నెలలైనా నేటి వరకు ఒక్క పింఛన్ మంజూరు చేయాలేదు. చివరకు దరఖాస్తు ప్రక్రియనూ ప్రారంభించక పోవడంపై అర్హులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త పింఛన్ కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొత్తవి ఇవ్వకపోగా..ఉన్న వాటిని తొలగిస్తుండటంపై లబి్ధదారుల్లో ఆందోళన నెలకొంది.
ఆలూరు రూరల్: కొత్త పింఛన్ల మంజూరుకు చంద్రబాబు ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడచినా కనీసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. పైగా తాము అధికారంలోకి వస్తే నెల రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్ల మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లకే ఎసరు పెడుతున్నారు. విచారణ పేరిట పింఛన్లకు క్రమం తప్పకుండా కోతలు పెడుతున్నారు.
మరో వైపు నియోజకవర్గంలో కొత్త పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రదక్షిణలు చేస్తున్నా వారి ఆశ నెరవేరడం లేదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అ«ధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదాలు నిట్టూర్తూ వెనుదిరుగుతున్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని సైతం చంద్రబాబు సర్కారు విస్మరించింది.
2 వేల మందికి పైగా ఎదురుచూపులు..
ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలాల పరిధిలో దాదాపు 2 వేలకు పైగా మంది అర్హులు కొత్త పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కార్యలయాల చుట్టూ, మరి కొందరు టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో సులభంగా..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉండేది. వలంటీర్లు అర్హుల ఇంటికి వెళ్లి వారే దరఖాస్తు చేసి పింఛన్ మంజూరు చేయించే వారు. ఆ సమయంలో ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నూనత పింఛన్ల కోసం ఎదురుచూపులే మిగిలుతున్నాయి.
కొత్త పింఛన్లు మంజూరు చేయాలి
గత ప్రభుత్వంలో మాదిరిగానే దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ల మంజూరు ప్రక్రియ కొనసాగించాలి. అధికారం చేపట్టి 19 నెలలు పూర్తవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పింఛన్ మంజూరు చేయకపోవడం దారుణం. మరో పక్క వెరిఫికేషన్ పేరుతో ఉన్న పింఛన్లు తొలగించే కుట్రలు పన్నుతోంది. వికలాంగులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమివ్వాలి.
– రామాంజనేయులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు


