కోవెలకుంట్ల సమీపంలో ఎండు తెగులుతో దెబ్బతిన్న శనగ పంట
కోవెలకుంట్ల: కోటి ఆశలతో ఈ ఏడాది రబీ సీజన్‌లో మొదటి పంటగా శనగ సాగు చేసిన రైతులకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనానికి ముందు అక్టోబర్ నెలలో మోంథా తుపాన్ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలతో అదునుకు విత్తనం వేయలేకపోయారు. పొలాల్లో తడి ఆరకపోవడంతో సాగు ఆలస్యమైంది. పైరు మొలకెత్తిన తర్వాత ఎండు తెగులు, కలుపు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 48,871 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలను సాగు చేశారు.
ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్‌లోని సంజామల మండలంలో 9,435 హెక్టార్లు, కోవెలకుంట్లలో 6,950, ఉయ్యాలవాడలో 11,076, దొర్నిపాడులో 3,011, కొలిమిగుండ్లలో 3,820, అవుకు మండలంలో 1,068 హెక్టార్లలో సాగైంది. ఈ ఏడాది అక్టోబర్ రెండవ వారం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శనగ సాగుకు అదును కాగా విత్తన సమయంలో వారం, పది రోజులపాటు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. పొలాల్లో తడి ఆరకపోవడం, భారీ వర్షాల కారణంగా పొలాల్లో కలుపుమొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటిని తొలగించేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు.
నవంబర్ రెండవ వారం వరకు విత్తన పనులు కొనసాగాయి. సాగుకు అదును దాటి పోవడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో శనగసాగు తగ్గిపోవడంతో సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. మిగిలిన ప్రాంతాల్లో ఎన్నో వ్యయ ప్రయాసలు ఎదుర్కొని విత్తనం వేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు ఇప్పటికే రూ. 15 వేలు వెచ్చించారు. కౌలు రైతులకు కౌలు రూపంలో అదనంగా మరో రూ. 10 వేలు భారం పడింది.
గతేడాదీ నుంచి గోదాములోనే..
గత ఏడాది జిల్లాలో 79 వేల హెక్టార్లలో శనగ పంట సాగుచేశారు. విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. వరణుడిపై భారం వేసి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో విస్తారంగా శనగ పంట సాగైంది. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు వేలాది రూపాయాలు వెచ్చించారు. మోతాదును మించి రసాయన ఎరువులు వాడటం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరు దెబ్బతిని నష్టం చేకూరింది. ప్రతి కూల పరిస్థితులతో ఎకరాకు 5 బస్తాల్లోపే దిగుబడులు వచ్చాయి.
దిగుబడులు చేతికందేనాటికి మార్కెట్‌లో శనగకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ ధరకు విక్రయించలేక పంట ఉత్పత్తులను గోదాముల్లో భద్రపరుచుకున్నారు. ప్రభుత్వం క్వింటా రూ. 8,750 మద్దతు ధర ప్రకటించగా మార్కెట్‌లో క్వింటా రూ. 5 వేలు పలకపోవడంతో ఇప్పటికి దిగుబడులు గోదాములు దాటలేదు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు కోటి బస్తాల దిగుబడులు గోదాముల్లో నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది.
గతేడాది దిగుబడులు అమ్ముడపోక ఈ ఏడాది కోటి ఆశలతో సాగు చేయగా తెగుళ్లు వెంటాడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల అదును దాటాక విత్తనం వేయడంతో పైరు అరకొరగా మొలకెత్తడంతో ఆ పంటను తొలగించే పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధిత వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పైర్లను పరిశీలించి తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.
వేరుకుళ్లు.. ఎండబెడుతోంది..
పంట మార్పిడి విధానం అవలంభించకపోవడం, విత్తన సమయంలో పొలాలను కలియదున్నకపోవడం, మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించింది. ఈ తెగులు ఆశించిన పైరులో మొక్క ఎండిపోయి చనిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగులు ఆశించిన పైరులో బైళ్లు, బైళ్లుగా మొక్కలు ఎండిపోవడంతో కొన్ని చోట్ల ఖాళీ పొలం కన్పిస్తోంది.
జిల్లాలో ఫూలేజి (తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. తుపాన్ కారణంగా పొలాల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో తెగులు ఆశించి పైరు దెబ్బతింటోందని వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు వెచ్చించగా పైరు ఎండు తెగులు కారణంగా శనగ ఎండిపోతుండటంతో రైతులు దిగుబడులపై ఆందోళన చెందుతున్నారు.
పంటంతా తెగులే
ఈ ఏడాది మూడు ఎకరాల సొంత పొలంలో పూలేజి రకానికి చెందిన శనగ పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, రెండు దఫాల క్రిమి సంహారక మందుల పిచికారి, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు రూ. 15 వేలు వెచ్చించాను. తేమ శాతం అధికంగా ఉండటంతో పంటంతా ఎండు తెగులు ఆశించి మొక్కలు ఎండిపోతున్నాయి. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు.
– సుధాకర్‌రెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం
శనగ సాగు కలిసి రావడం లేదు
రెండేళ్ల నుంచి పప్పుశనగ సాగు కలిసి రావడం లేదు. ఈ ఏడాది ఇరవై ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 15 వేలు చెల్లించి మరో 40 ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ పంట సాగు చేశాను. పైరు నెల రోజుల దశలో ఉంది. పెట్టుబడుల రూపంలో ఇప్పటికే రూ. 12 వేలకు పైగా ఖర్చు చేశాను. అధిక వర్షాలతో శనగ అదునుకు సాగు చేయలేకపోవడం, పొలంతో తేమ శాతం అధికంగా ఉండటంతో ప్రస్తుతం పైరును వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు చనిపోయి పొలం బైళ్లుగా ఏర్పడుతోంది.
– రామసుబ్బరాయుడు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం


