‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’ | How did YSRCP succeed with the Koti Santhakalu Sekerana movement | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ: ‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’

Dec 15 2025 1:59 PM | Updated on Dec 15 2025 2:55 PM

How did YSRCP succeed with the Koti Santhakalu Sekerana movement

చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్‌ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. 

పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. 

చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్‌ జగన్‌ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. 

ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్‌ జగన్‌ అభిమతం. 

రచ్చబండతో షురూ ..
అక్టోబర్‌లో వైఎస్సార్‌సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..  విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.

తుపాను ఆపలేకపోయింది!
లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్‌ అవుతుందని కూటమి సర్కార్‌ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్‌కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. 

ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. 

డిసెంబర్‌ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement