నేటి నుంచి తొలి టెస్టు
సొంతగడ్డపై ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా
విజయంపై ఇంగ్లండ్ ఆశలు
ఉదయం గం. 7:50 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
టెస్టు క్రికెట్‌లో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న సుదీర్ఘ వైరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌కు నేటితో తెర లేవనుంది. ఇరు జట్ల ఆటగాళ్లను ఒక్క మంచి ప్రదర్శనతో హీరోలుగా, ఒక్క పరాజయంతో జీరోలుగా మార్చగల ఈ సమరంపై క్రికెట్ అభిమానులందరి దృష్టీ నిలిచింది.
సొంతగడ్డపై ఆ్రస్టేలియా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నా... ‘బాజ్‌బాల్’ తరహా ఆటతో తమకంటూ విజయావకాశాలు ఉన్నాయని ఇంగ్లండ్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడు వారాల పాటు హోరాహోరీ ఆట ఖాయం. పెర్త్ స్టేడియంలో పిచ్‌పై పచ్చిక ఉంది. ఆరంభంలో పేస్, బౌన్స్‌కు బాగా అనుకూలిస్తూ ఆ తర్వాత నెమ్మదించే అవకాశం ఉంది.
పెర్త్: యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో ఆ్రస్టేలియా పర్యటించగా, ఆ సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అంతకుముందు 2021లో ఆసీస్ గడ్డపై ఆడిన ఇంగ్లండ్ 0–4తో చిత్తుగా ఓడింది. ఈ గణాంకాలు చూస్తే ఎవరిది పైచేయో అర్థమవుతుంది. అయితే కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పర్యవేక్షణలో దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్ తమ ప్రత్యర్థిని ఓడించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది.
ముఖ్యంగా తొలి టెస్టులో ఇద్దరు ఆసీస్ ప్రధాన పేసర్లు జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌కు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సిరీస్‌లో శుభారంభం చేస్తే దానిని కొనసాగించాలని బెన్ స్టోక్స్ బృందం పట్టుదలగా ఉంది. అయితే సమర్థుడైన స్టీవ్ స్మిత్ టీమ్‌కు నాయకత్వం వహించడం ఆసీస్‌కు బలం.
ఇద్దరు అరంగేట్రం...
‘స్మిత్‌ను 40 పరుగుల్లోపు ఆపగలిగితే మంచిది. లేదంటే మ్యాచ్ చేజారినట్లే’... ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్య ఇది. అతని బ్యాటింగ్ ప్రభావం ఎలాంటిదో ఇది చెబుతుంది. ఇప్పుడు కూడా స్మిత్ బలమైన బ్యాటింగే ఆసీస్‌కు పెద్ద బలం. ఇతర సీనియర్లలో లబుషేన్, హెడ్‌లపై ప్రధానంగా బ్యాటింగ్ భారం ఉంది. చాలా కాలంగా విఫలమవుతున్నా ఉస్మాన్ ఖ్వాజా అదృష్టవశాత్తూ ఈ సిరీస్‌లో అవకాశం దక్కించుకున్నాడు.
అతనికి ఓపెనింగ్ భాగస్వామిగా కొత్త ఆటగాడు జేక్ వెదరాల్డ్ బరిలోకి దిగుతాడు. కీపర్ అలెక్స్ కేరీకి కూడా టెస్టు బ్యాటర్‌గా మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఫిట్‌నెస్ సమస్యలు దాటి కొత్తగా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. గాయాల కారణంగా రెగ్యులర్ కెపె్టన్ కమిన్స్, హేజల్‌వుడ్ తొలి టెస్టు నుంచి తప్పుకోవడంతో బౌలింగ్‌లో సీనియర్ మిచెల్ స్టార్క్‌పై చాలా పెద్ద బాధ్యత ఉంది.
బోలండ్ అతనికి తగిన భాగస్వామి కాగా, మరో పేసర్ బ్రెండన్ డగెట్ తొలి టెస్టు ఆడబోతున్నాడు. ఎప్పటిలాగే ఏకైక స్పిన్నర్ లయన్ ప్రత్యర్థి కి సవాల్ విసురుతున్నాడు. 2019 తర్వాత ఆ్రస్టేలియా జట్టు తరఫున ఒకే టెస్టులో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి.
స్పిన్నర్ లేకుండా...
తొలి టెస్టు వరకు మాత్రం ఆసీస్‌తో పోలిస్తే ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగనుండటం విశేషం. ఆర్చర్, మార్క్‌వుడ్‌లాంటి ఫాస్టెస్ట్ బౌలర్లతో పాటు అట్కిన్సన్, కార్స్ ఆడనుండగా బౌలింగ్‌లో స్టోక్స్ కీలక పాత్ర పోషించడం ఖాయం. తుది జట్టులో ఇంగ్లండ్ ఒక్క స్పిన్నర్‌ను కూడా తీసుకోవడం లేదు. బ్యాటింగ్‌తో భారత్‌తో సిరీస్ సహా గత కొంతకాలంగా టాప్–7లో ఎలాంటి మార్పూ లేదు.
పెద్దగా రాణించకపోయినా క్రాలీ, పోప్‌లపై జట్టు నమ్మకం ఉంచింది. డకెట్, బ్రూక్, స్టోక్స్ ఎలా ఆడతారనేది ఆసక్తికరం. అందరి దృష్టీ ఇప్పుడు జో రూట్‌పై నిలిచింది. ఆధునిక టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు ఉన్న రూట్ ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతని తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఈ సిరీస్‌లో ఆ లోటును పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, జట్టుపరంగా చూసినా కూడా రూట్ ఆట సిరీస్ ఫలితాన్ని నిర్దేశించగలదు.
34-32
ఓవరాల్‌గా 73 యాషెస్ సిరీస్‌లు జరిగితే...ఆ్రస్టేలియా 34, ఇంగ్లండ్ 32 గెలవడం ఇరు జట్ల మధ్య పోటీని చూపిస్తోంది.
152-111
యాషెస్ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 361 టెస్టులు జరిగాయి. ఆ్రస్టేలియా 152 గెలవగా, ఇంగ్లండ్ 111 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
13
సొంతగడ్డపై జరిగిన గత 15 యాషెస్ టెస్టుల్లో ఆ్రస్టేలియా 13 గెలిచి, 2 ‘డ్రా’ చేసుకుంది. ఒక్కదాంట్లోనూ ఓడలేదు. 2011 జనవరి తర్వాత ఇక్కడ ఇంగ్లండ్ ఒక్క టెస్టు కూడా నెగ్గలేకపోయింది. 2023 తర్వాత ఓవరాల్‌గా అన్ని జట్లపై కలిపి ఆడిన 18 టెస్టుల్లో ఆసీస్ 14 గెలిచింది. ఆసీస్ గడ్డపై ఆడిన గత మూడు ‘యాషెస్’లలో ఇంగ్లండ్ 0–5, 0–4, 0–4తో ఓడింది.


