లేఖరాయండి.. గిఫ్ట్ కొట్టండి.. పోస్టల్ శాఖ వినూత్న పోటీ
ఏవిటో... పెళ్ళివాళ్ళొచ్చి మనవరాలు శ్రీలేఖను చూసుకుని వెళ్లారు.. వాళ్లకు నచ్చిందీ లేనిది ఉత్తరం రాస్తామన్నారు.. వెళ్లి రెండు వారాలైంది.. ఇంకా లేఖ రానేలేదు.. అంటే ఈ సంబంధం కూడా అంతేనా.. అంటూ సుభద్రమ్మ నొచ్చుకుంటోంది.. అంతలోనే ఒసేయ్ అమ్మా... పెళ్ళివాళ్ళ నుంచి ఉత్తరం వచ్చింది.. వాళ్లకు మన శ్రీలేఖ నచ్చిందట .. త్వరలో వచ్చి తాంబూలాలు పుచ్చుకుంటారట అని కొడుకు సుధాకర్ చెబుతుంటే అబ్బా.. నా నోట్లో చక్కెర పోశావురా ... ఉండు పోస్ట్ మ్యాన్‌కు ఈ నాలుగు బొబ్బట్లు ఇచ్చి అయన నోరు తీపి చేస్తా అంటూ సుభద్రమ్మ కదిలింది..
ఒరేయ్ వెధవా.. నేను ప్రతినెలా నీకు డబ్బులు పంపడం నువ్వు ఖర్చుపెట్టుకుని తిరగడమేనా చదువుకుని బాగుపడేది ఏమైనా ఉందా అంటూ హాష్టల్లోని రామకృష్ణకు తండ్రి నారాయణ నుంచి వచ్చిన లెటర్ అయన రూమ్మేట్లు అందరూ చదివి రామకృష్ణ పై కామెంట్లు చేసుకునేవాళ్ళు..
పెళ్ళై మూడురాత్రులు ముగియగానే వెళ్లిపోయారు.. కొత్తగా అద్దెకు ఇల్లు తీసుకుని ఉత్తరం రాస్తామన్నారు.. ఇంకా రూమ్ దొరికిందో లేదో.. అయన వెళ్లిన తరువాత ఒక్కో క్షణం ఒక్కో యుగంలా తోస్తోంది.. ఎప్పుడెప్పుడు ఉత్తరం వస్తుందా ఆయనతోబాటు వెళ్లి ఒళ్ళో వాలిపోదామా అని ఎదురుచూసే నవవధువు..
ఏమండీ ... అల్లుడుగారు ఉత్తరం రాశారు.. సంక్రాంతి పండక్కి ఆయనకు ఎలాగైనా ఆల్విన్ వాచ్... కొత్త సైకిల్ కొని ఇవ్వాల్సిందేనంట.. లేకపోతె అమ్మాయిని తీసుకెళ్లేది లేదని అంటున్నాడు.. అన్నీ సిద్ధం చేసాం.. అలకమానేసి పండక్కి రమ్మని తిరుగు లెటర్ రాయండి.. అంటోంది రుక్మిణమ్మ..
ఏమిటే ఉత్తరం అంత దీర్ఘంగా చదూతున్నావు అన్నాడు రాఘవయ్య... అవునండీ.. వైజాగ్ నుంచి అబ్బాయి ఉత్తరం రాసాడు.. పిల్లలిద్దరికీ జ్వరాలట... కోడలు ఒక్కతీ చేసుకోలేకపోతోందట.. నన్ను రమ్మన్నాడు.. ఓ నాల్రోజులు ఉండి వస్తాను.. చెబుతోంది భారతమ్మ.. ఇప్పుడే వెళ్తే ఎలా.. వరికోతలు అయ్యాక బియ్యం తీసుకుని వెల్దువులే.. ఇదే విషయం నేను ఉత్తరం రాస్తాను.. తేల్చేసాడు రాఘవయ్య..
ఒరేయ్ నానిగా... సంక్రాంతికి అక్కను బావను పండక్కీరామ్మని ఉత్తరం రాశావా... .. మర్చిపోవద్దు సుమీ... అసలే మీ బావ తిక్కలోడు.. కనీసం వారం ముందు లెటర్ రాకపోతే మర్యాద తగ్గిందని అలుగుతాడు.. గమ్మున లెటర్ రాసి డబ్బాలో వెసెయ్యిరా... నానమ్మ కేకేసింది..
ఇదీ భారత సమాజంలో ఉత్తరానికున్న ప్రాధాన్యం.. కష్టం సుఖం .. సంతోషం ఆనందం.. బాధ విషాదం.. విజయం.. అపజయం ... ఏదైనా సరే ఉత్తరం ద్వారానే చేరేది.. పాతికేళ్ల క్రితం ఏ ఆనందాన్ని పంచుకోవాలన్నా .. కష్టాన్ని చెప్పుకోవాలన్నా ఉత్తరమే మాధ్యమం..
ఇప్పుడంటే అన్నీ ఫోన్లు వాట్సాప్ లు ... వీడియో కాల్స్ వచ్చి మొత్తం సమాజాన్ని మార్చేశాయి కానీ ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్తే ఉత్తరమే ప్రధాన సమాచార వాహిక. అప్పట్లో ఉత్తరం రాయడం ఒక కళ. ఊళ్ళో చదువుకున్నకుర్రాళ్ళను బతిమాలి దూరంలోని తమ బంధుమిత్రులకు.. బిడ్డలకు.. ఉత్తరాలు రాయించుకోవడం గ్రామాల్లోని ప్రజలకు అలవాటైన ప్రక్రియ. ప్రియుడు.. ప్రియురాళ్లమధ్య ఉత్తరాల రాయబారం నడిచేది.. నేడు సాంకేతికత పెరిగిన కారణంగా ఉత్తరాలు రాయడం కూడా లేదు.. ఉత్తరాలు రాసేవాళ్ళు.. రాయడం వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయారు.. దీంతో ప్రజల్లో ఉత్తరాలు రాసే నైపుణ్యాన్ని గుర్తించేందుకు భారతీయ పోస్టల్ శాఖ ఏకంగా ఉత్తరాల పోటీలు నిర్వహిస్తోంది.. ఒక్కో సర్కిల్ పరిధిలో నాలుగేసి ఉత్తమ లేఖలకు రూ. 25 వేలు చొప్పున బహుమతి అందిస్తోంది.. ఇంకా సెకెండ్ ప్రయిజ్ కూడా ఉంది.. DHAI AKHAR పేరిట నిర్వహిస్తున్న ఈ ఉత్తరాల పోటీలో యువత పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు పోస్టల్ శాఖ వెబ్సైట్ ను సందర్శించండి..
సిమ్మాదిరప్పన్న


