
మెకింటోష్ (ఎడమ), లెడెకీ (కుడి)లతో టిట్మస్
ఆస్ట్రేలియా ఒలింపిక్ చాంప్ టిట్మస్ ఆకస్మిక నిర్ణయం
బ్రిస్బేన్: అరిన్ ఎలిజబెత్ టిట్మస్ ఆస్ట్రేలియన్ స్విమ్మర్. అలాంటి... ఇలాంటి... స్విమ్మర్ కాదు. చాంపియన్... ఆహా... అంతకుమించే! ఈ అమ్మడు వయసు 25... పతకాల సంఖ్య బోలెడు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌లాంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో 32 పతకాలు. ఇందులో స్వర్ణాలే 18 అంటే... చాంపియన్ కాదు అంతకుమించి అనడంలో అతిశయోక్తి ఉండదేమో! మరో మెగా ఈవెంట్ లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతుందనుకుంటే... ఆశ్చర్యకరంగా రిటైర్మెంట్ ప్రకటించింది.
తన బంగారు క్రీడా భవిష్యత్తును పాతికేళ్లకే ముగించింది. గురువారం తన ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియో సందేశంతో ఫాలోవర్లతో పాటు అభిమానుల్ని విస్మయపరిచింది. ‘నేనెప్పటికీ స్విమ్మింగ్‌నే ప్రేమిస్తాను. చిన్నప్పుటి నుంచే అదే నా లోకం. అయితే అదే మొత్తం జీవితం కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నా జీవితంలో స్విమ్మింగ్ కంటే ప్రధానమైనవి కూడా ఉన్నాయని ఈ మధ్యే గ్రహించాను. అందుకే ఇక చాలనుకుంటున్నా. ఇక్కడితోనే ఆటకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నా’ అని ఆ్రస్టేలియన్ స్టార్ స్విమ్మర్ వీడియోను పోస్ట్ చేసింది.

గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా గ్రేట్ కేటీ లెడెకీ, కెనడా స్టార్ సమ్మర్ మెకింటోష్ లను వెనక్కి నెట్టి మరీ టిట్మస్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ ముగ్గురు కూడా దిగ్గజ స్విమ్మర్లు. అంతర్జాతీయ పోటీల్లో రికార్డులు నెలకొల్పినవారే కావడంతో పారిస్ ఈవెంట్‌లో గెలుపెవరిదనే అంచనాలు ఆకాశన్నంటాయి. చివరకు అరిన్ టిట్మసే ‘బంగారు చేప’గా నిలిచింది. తన రిటైర్మెంట్ సందేశంలోనూ ఈ పోటీనే తన ఫేవరెట్ ఈవెంట్‌గా పేర్కొంది.
హేమాహేమీలతో దీటైన పోటీని ఆస్వాదించినట్లు చెప్పింది. పారిస్ ఈవెంట్‌కు ముందు, ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల్ని సైతం ఎదుర్కొన్నట్లు అరిన్ చెప్పింది. 2023లో కూడా ఆమెకు శస్త్రచికిత్స చేసి ట్యూమర్లు తొలగించారు. అయితే ఏడాదిలోపే ఈ ‘ఆపరేషన్’ను అధిగమించి పతకాల ఆపరేషన్‌ను విజయవంతం చేసుకుంది. తన 25 ఏళ్ల జీవితంలో 18 ఏళ్లు కొలనులోనే గడిచిందని ఆమె చెప్పుకొచ్చింది.
అరిన్ ఘనతలివే...
తొమ్మిదేళ్ల క్రితం అంటే 16 ఏళ్ల ప్రాయంలోనే అరిన్ టిట్మస్ అంతర్జాతీయ పతకాల వేట మొదలైంది. 2016లో మాయిలో జరిగిన జూనియర్ పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో ఆమె రజతం, కాంస్యం నెగ్గింది. ఇక సీనియర్ కేటగిరీలో అయితే బంగారు పతకాల మోతే మోగించింది. 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, ఫ్రీస్టయిల్, 4్ఠ200 మీటర్ల రిలే ఈవెంట్లలో 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు నిలబెట్టుకుంది.
హాంగ్జౌ (2018), గ్వాంగ్‌జు (2019) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ టైటిల్స్‌ను నిలబెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌తో విశ్వక్రీడల బరిలో దిగిన ఆమె 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెలిచిన ఆమె పారిస్‌లో నిలబెట్టుకుంది.