ఆదిలాబాద్: అతను సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ముగ్గురు కొడుకులు, కూతురును చదివించాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో కుంగిపోయాడు. అయినా కూతురుకు, పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. ప్రస్తుతం పిల్లలు ఉద్యోగ రిత్యా దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్న అతనికి అందరూ ఉన్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి.
ఒంటరిగా జీవించడంతో జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో ఆదివారం జరిగింది. ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బచ్చు సుదర్శన్(75) భార్య 20 ఏళ్ల క్రితం మరణించింది.
2007లో గోల్డెన్‌షేక్ హ్యాండ్ ద్వారా రిటైర్ అయ్యాడు. వృత్తి రీత్యా కుమారులు హైదరాబాద్‌లో ఉంటుండగా, కుమార్తె అత్తింట్లో ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడికి ఫోన్ చేశాడు. హైదరాబాద్‌కు వస్తానని తెలిపాడు. దీంతో కొడుక రెండు రోజల తర్వాత రావాలని సూచించాడు. ఇంతలోనే సుదర్శన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి వద్దకు వచ్చిన పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


