ఫస్ట్‌ క్లాస్‌ జర్నీ | Asia First Woman Train Driver Surekha Yadav Retired | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ క్లాస్‌ జర్నీ

Sep 20 2025 12:30 AM | Updated on Sep 20 2025 12:30 AM

Asia First Woman Train Driver Surekha Yadav Retired

తొలి అడుగు

కాస్త సరదాగా చెప్పుకోవాలంటే... ‘నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అనే ఆరుద్ర మాట సురేఖ యాదవ్‌కు వర్తించదు. నిజానికి రైలే ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఆసియా ఫస్ట్‌ ఉమెన్‌ ట్రైన్‌ డ్రైవర్‌గా చరిత్ర సృష్టించిన సురేఖ రిటైర్‌ అయింది. ఆమె ఒక రైలుబడి. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి. భావితరాలకు మార్గదర్శకాలు ఉన్నాయి. 

మహారాష్ట్రలోని సతారలో పుట్టి పెరిగింది సురేఖ. అయిదుగురు పిల్లల్లో పెద్దది. తండ్రి రామచంద్ర భోంస్లే  రైతు. సతారాలోని సెయింట్‌ పాల్‌ కాన్వెంట్‌ హైస్కూలులో చదువుకున్న సురేఖ వృత్తివిద్యా కోర్సులో చేరింది. ఆ తరువాత.. కరాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రిక్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్‌), బీయీడీ చేసింది.

టీచర్‌ కాదు రైలు డ్రైవర్‌
బీయీడీ చేసిన సురేఖ టీచర్‌ కావాలనుకునేది. అయితే ఆమెకు రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. ముంబైలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసుకొని సెంట్రల్‌ రైల్వేస్‌లో ట్రైనీ అసిస్టెంట్‌ డ్రైవర్‌గా చేరింది. 1985లో కల్యాణ్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంది. అసిస్టెంట్‌ డ్రైవర్‌గా ఆమె వృత్తి ప్రయాణం మొదలైంది. వాడి బందర్, కల్యాణ్‌ల మధ్య నడిచే గూడ్స్‌ ట్రైన్‌లో ఇంజిన్‌ రన్నింగ్‌ కండీషన్, సిగ్నల్స్‌... మొదలైన వాటిని పర్యవేక్షించేది. కొన్ని సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో గూడ్స్‌ డ్రైవర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఆ తరువాత వెస్ట్రన్‌ ఘాట్‌ రైల్వేస్‌లో డ్రైవర్‌గా పనిచేసింది.

→ దక్కన్‌ క్వీన్‌ డ్రైవ్‌ చేసిన క్వీన్‌
దక్కన్‌ క్వీన్‌(డైలీ పాసింజర్‌ ట్రైన్‌) డ్రైవర్‌గా పాసింజర్‌ ట్రైన్‌ను నడిపిన ఆసియాలోని తొలి మహిళగా గుర్తింపు పొందింది సురేఖ. ఘాట్‌ లైన్‌ కోసం రెండు–ఇంజిన్‌ల  ప్యాసింజర్‌ ట్రైన్‌ నడపడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంది. గతంలో మహిళలు ఎవరూ ఘాట్‌ లైన్‌లో ట్రైయిన్‌ నడపక పోవడం వల్ల పై అధికారులకు సందేహాలు ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ ‘శభాష్‌’ అనిపించుకుంది సురేఖ. ‘దక్కన్‌ క్వీన్‌ ట్రైన్‌ నడపాలనేది నా కలగా ఉండేది.  ఎందుకంటే మహిళ పేరుతో నడిచే రైలు అది. ఆ పేరులో రాజసం ధ్వనిస్తుంది. ఆ కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. భారతీయ రైల్వే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గర్వంగా ఉంది. మహిళలకు ప్రత్యేకించిన ట్రైన్స్‌ను నడపడం కూడా సంతోషంగా ఉంది’ అంటుంది సురేఖ.

→ గురువుగా...
ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌ డ్రైవర్‌గా 2011లో ప్రమోట్‌ అయిన సురేఖ ఆ తరువాత కల్యాణ్‌లో డ్రైవర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (డిటీసి)లో సీనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పాఠాలు బోధించింది. మన దేశంలో ట్రైన్‌ నడిపిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది.  2011లో 50 మంది మహిళలు సబర్బన్, గూడ్స్‌ ట్రైన్‌ డ్రైవర్‌లుగా ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాంటి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి...సురేఖ.

→ ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై...
‘ఆడవాళ్లు ట్రైన్‌ డ్రైవర్‌ ఏమిటి! అని ఆశ్చర్యపోయే రోజుల్లో కూడా నా కుటుంబం, మిత్రులు, బం«ధువుల నుంచి ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై నన్ను ముందుకు నడిపించింది.  వృత్తిజీవితంలో నాకు ఎలాంటి వివక్షా ఎదురుకాలేదు. ట్రైన్‌ ఎక్కిన తొలి క్షణం నుంచి మరే విషయాలు మదిలో రాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది సురేఖ. నిజానికి ఆమె రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఆ ఉద్యోగమే ఆమెను చరిత్రలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది.

ఘనమైన వీడ్కోలు
సురేఖ యాదవ్‌ ఫేర్‌వెల్‌ సెలబ్రేషన్‌ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ (సీఎస్‌ఎంటీ)లో ఘనంగా జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సురేఖ ఆత్మీయలు, స్నేహితులు, బంధువులు, రైల్వే ఉద్యోగులు ఆమె మెడలో పూలమాలలు వేశారు. డోళ్లు వాయిస్తూ నృత్యాలు చేశారు. ‘సురేఖ రిటైర్‌ అయినప్పటికీ... ఆమెలోని శక్తి సామర్థ్యాలు రిటైర్‌ కావు. అవి ఎప్పుడూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి’ అన్నారు వక్తలు.

కష్టం లేదు... ఎప్పుడూ ఇష్టమే!
‘ట్రైయిన్‌ నడపడం అంటే మాటలా!’లాంటి మాటలు వినిపించినప్పటికీ నేను ఎప్పుడూ భయపడలేదు. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా శిక్షణ తీసుకున్నాను. ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యోగం ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. కుటుంబ, వృత్తి బాధ్యతలను జాగ్రత్తగా సమన్వయం చేసుకునేదాన్ని.
– సురేఖ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement