విలువలతో కూడిన రాజకీయాలు ఈ రోజుల్లో అత్యంత అరుదు. అందునా.. నైతిక బాధ్యత అనే పదం వినిపించడం లేదు. అయితే 26/11 (2008లో..) ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి పదవిని వదులుకున్నారు శివరాజ్ పాటిల్. అలాంటి నిబద్ధత కలిగిన దిగ్గజ నేత ఇక లేరు.
కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్(90) ఇక లేరు. అనారోగ్యంతో మహారాష్ట్ర లాతూర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా.. కేంద్ర మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, గవర్నర్‌గానూ ఆయన సేవలందించారు.
శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న లాతూర్‌లో జన్మించారు. 1966–1970 మధ్య లాతూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా వెళ్లారు. 1977–1979 మధ్య డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా సేవలందించారు. 1980లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, లాతూర్ నియోజకవర్గం నుండి వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచారు. లోక్‌సభకు 10వ స్పీకర్‌గా(1991–1996) పనిచేశారు.
2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. 26/11 (2008లో..) ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాస్త గ్యాప్‌తో 2010–2015లో పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. మొత్తంగా పార్లమెంటులో, ప్రభుత్వంలో నాలుగు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు.
సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన్ని.. రాజకీయాల్లో శాంత స్వభావుడిగా, క్రమశిక్షణ.. నిబద్ధత కలిగిన నేతగా అభివర్ణిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన నిరంతర సేవలు అందించారు, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ పనిచేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడిన స్పీకర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శివరాజ్ పాటిల్ భార్య పేరు విజయా పాటిల్. కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన (బీజేపీ నాయకురాలు), ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. శివరాజ్ పాటిల్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కోమటి రెడ్డి సంతాపం
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ మరణం పట్ల తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1972లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ పాటిల్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలుపొందారనీ,ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు,మన్మోహన్ సింగ్ కేబినెట్లో రక్షణ (Defence), సైన్స్ & టెక్నాలజీ, మరియు హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారనీ గుర్తు చేశారు. 10వ లోక్‌సభ స్పీకర్‌గా, పంజాబ్ గవర్నర్‌గా కూడా ఆయన సేవలందించారన్నారు. సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెబుతూ.. వారి కుటుంబ సభ్యులకు,ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


