తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు అభినందనలు. అయితే, ఈ రెండేళ్ల పాలన ప్రజలను సంతృప్తి పరిచిందా? అనేది ఇది చర్చనీయాంశం. ప్రభుత్వం ఏవైనా కొన్ని హామీలను నెరవేర్చడం మరికొన్నింటిలో విఫలం కావడం సహజం. కాగా, మొత్తమ్మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్న విషయంపై ఎవరి అంచనాలు వారివి. రేవంత్ ప్రభుత్వ పాలన రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అనే చందంగా ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. ఏదో చేయాలన్న తాపత్రయం, కొన్ని చేయలేక సతమతమవడం, ఆపైన బుకాయింపు, ప్రచారంతో జనాన్ని మాయ చేయాలన్న ప్రయత్నం కనిపిస్తాయి. కొన్ని విషయాలలో రేవంత్ గురువు చంద్రబాబు బాటలోనే అతిశయోక్తులు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.
ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్షీణించుకుపోయిన నేపథ్యంలో రేవంత్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదిగి అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. ఆ దూకుడే రేవంత్ కలిసివచ్చిందని చాలా మంది నమ్ముతారు. సీఎం అయిన తర్వాత కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తున్నప్పటికీ అన్నిసార్లు కలిసి వస్తున్నట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో రేవంత్ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, చట్టబద్దత తెస్తామని ప్రచారం చేశారు. అయితే, వీటిల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన వాటినేవీ పూర్తిగా నెరవేర్చినట్లు కనపడదు. రైతు రుణమాఫీ, కేసీఆర్ పథకం రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులకు వర్తింపు, ఎకరాకు రూ.15 వేలన్న హామీ, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక పథకం, మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలకు పెంపు, విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలల హామీలేవీ అమలు కాలేదనే చెప్పాలి.
తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు, కబ్జా వంటివాటికి దూరంగా ఉంచాలన్న ప్రయత్నం బాగానే ఉంది. హైడ్రా ద్వారా చెరువుల గర్భాలలో ఉన్న నిర్మాణాలను కూల్చారు. కానీ, ఈ సందర్భంలో పేద, మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టం జరిగింది. వారు అప్పో, సప్పో చేసి కొనుగోలు చేసిన అపార్టుమెంట్లు, విల్లాలు తమ కళ్లెదుటే కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయారు. అన్ని అనుమతులు ఉన్నాయన్న భావనతో వారు కొనుగోలు చేస్తే అవి చెరువు గర్భంలో ఉన్నాయంటూ హైడ్రా పలు చోట్ల కూల్చివేసింది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రాకుండా చూడాలన్న ఉద్దేశం మంచిదైనా ఆచరణలో గందరగోళం వల్ల ప్రభుత్వానికి ప్రజలలో చెడ్డ పేరు రావడానికి ఆస్కారం కలిగింది. అదే సమయంలో పరపతి, సంపన్నుల ఆక్రమణల జోలికి పెద్దగా వెళ్లలేదన్న విమర్శలు వచ్చాయి. కొన్నిచోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే నిర్మాణాలు కూల్చారు. హైదరాబాద్‌లో కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూములను రక్షించినట్లు హైడ్రా అధికారి రంగనాథ్ చెబుతున్నారు.
మూసీ సుందరీకరణ స్కీమ్ అమలుకు హడావుడి చేశారు కానీ, అక్కడ నివసించే పేద వర్గాల నిరసన, రాజకీయ పక్షాల ఆందోళనల నేపథ్యంలో అది ముందుకు సాగడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గడానికి హైడ్రా యాక్టివిటీ కూడా కొంత కారణం అన్న భావన ఏర్పడింది. అయినా ఓవరాల్ ఎకానమీ వల్ల రియల్ ఎస్టేట్ కొంత తగ్గి ఉండవచ్చని, కానీ తిరిగి బాగానే పుంజుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగినట్లే కోకాపేట వైపు ఎకరా రూ.150 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకు వేలంలో అమ్ముడుపోవడం సంచలనంగా ఉంది. అయినా మధ్య తరగతి నుంచి ఇళ్లు, స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు పెరగనంత వరకు ఈ రంగం స్తబ్ధతగా ఉంటుంది.
ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసం రేవంత్ ప్రభుత్వం భారీ ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించారు. కానీ, ఎవరూ రాలేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాత్రం వచ్చి వెళ్లారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై ఏపీలో మాదిరి అంకెల గారడీ మరీ ఎక్కువ చేసినట్లు అనిపించలేదు. పరిశ్రమల భూములను ఇతర అవసరాలకు వియోగించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. కేవలం రిజిస్టర్డ్ విలువలో 30 శాతానికే పరిశ్రమల వారికి ఆ భూములు ఇవ్వాలన్న ప్రతిపాదనతో లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నగరంలో కాలుష్యం సమస్య నివారించడానికి తమ ప్రయత్నమన్నది రేవంత్ వాదనగా ఉంది. ఈ స్కీమ్ అమలు వల్ల ప్రభుత్వానికి కొంత మేర నిధులు సమకూరవచ్చు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ రుణాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసేది. కానీ, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో ఉంది. గత ఆరు నెలల్లో నిర్దిష్ట రుణాలకన్నా 190 శాతం అధికంగా అప్పులు తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో కథనం వచ్చింది. ప్రభుత్వంలో అవినీతిపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం, ఈ-ఫార్ములా రేస్ వ్యవహారాలలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు కానీ, ఎందువల్లో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చినా, తొలుత చూపిన శ్రద్ద ఇప్పుడు కనిపించకపోవడంతో జనం కూడా పెద్దగా రావడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో వీక్‌గా ఉండడం రేవంత్‌కు ప్లస్ పాయింట్‌గా ఉంది. దానికి తోడు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని కాంగ్రెస్‌ను రేవంత్ గెలిపించారు. కాంగ్రెస్‌పై ప్రజలలో వ్యతిరేకత లేదని అనడానికి ఇది రుజువుగా తీసుకోరాదు. కాకపోతే తాత్కాలికంగా ఉపశమనంగా కనిపిస్తుంది. ఈ మూడేళ్లలో రేవంత్ జాగ్రత్తలు తీసుకుని ప్రజలలో ప్రభుత్వ ఇమేజీని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో రేవంత్ ప్రకటనలు మరీ అతిగా ఉండకుండా ఉంటే మంచిది.
ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణను తయారు చేస్తున్నామని, తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్ అని, అభివృద్ది కోసం ప్యూర్, క్యూర్, రేర్, దేశానికి తెలంగాణనే రోల్ మోడల్, ఢిల్లీకి నొయిడా-తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయికి లగచర్ల పారిశ్రామికవాడ, వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్.. ఇలాంటివి ఎన్నికల సమయంలో ఇచ్చే నినాదాలుగా కనిపిస్తాయి. కానీ, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇవే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు ప్రశ్నలుగా ఎదురవుతాయి. రేవంత్ ఒక నిజం చెప్పారు. కాళ్లలో కట్టెలు పెట్టడం-రాజకీయాలలో గేమ్ రూల్ అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ ఆ వ్యూహాన్నే అమలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు తనకు కూడా అదే సమస్య అవుతుందన్న అనుమానం ఉండవచ్చు. కాళ్లలో కట్టెలు పెట్టే అవకాశం లేకుండా చేసుకుని రేవంత్ ముందుకు వెళ్లగలుగుతారా? అన్నది కాలమే చెప్పాలి.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


