తెలంగాణలో 35 లక్షల చిన్న పరిశ్రమలు
తెలంగాణలో ఇప్పటివరకు 35.39 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లోక్‌సభలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిస్తూ జిల్లాల వారీగా వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 4.82 లక్షల పరిశ్రమలు ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి (2.84 లక్షలు), మేడ్చల్ మల్కాజిగిరి (2.24 లక్షలు) నిలిచాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 20,325 యూనిట్లు నమోదయ్యాయి. ‘క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’కింద 2024–25లో ఇప్పటివరకు తెలంగాణలో ఏకంగా 97,292 గ్యారెంటీలను ఆమోదించారు. వీటి విలువ రూ.11,586 కోట్లు అని, గత ఏడాది రూ.6,368 కోట్ల గ్యారంటీలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అని కేంద్రమంత్రి తెలిపారు.


