రాష్ట్రపతి నిలయంలో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు
ఈ నెల 17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది నేపథ్యంలో సీఎస్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగల సమస్యను పరిష్కరించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అలాగే 24 గంటలూ స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గురువారం సచివాల యంలో సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్షించారనీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విస్తతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
పోలీసు శాఖ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ అవసరమైన బారికేడింగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీజీపీ శివధర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ, హోం శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు.


