డ్యామ్ సేఫ్టీ చట్టం కింద స్పెసిఫైడ్ జాబితాలో 174 జలాశయాలు చేర్చిన రాష్ట్రం
డ్యామ్‌ల పరిధిలోకి రాని బరాజ్‌లు, చెరువులను సైతం చేర్చిన వైనం
వీటి సమగ్ర మూల్యాంకనానికి ఏడాదే గడువున్నా పురోగతి లేదంటూ ఇప్పటికే కేంద్రం లేఖ
తాజా సమీక్షలో ఎన్డీఎస్‌ఏ చైర్మన్ తీవ్ర అసంతృప్తి
ఏదైనా జరిగితే సంబంధిత డ్యామ్‌ల సీఈలే బాధ్యులని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవచ్చనే ఆశతో ఏకంగా రాష్ట్రంలోని 174 జలాశయాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్, 2021 పరిధిలోకి తీసుకువచ్చి స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలో పొందుపర్చడం.. ఇప్పుడు నీటిపారుదల శాఖకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. చట్టం ప్రకారం ఈ డ్యామ్‌ల భద్రతకు సంబంధించిన మూల్యాంకనాన్ని పూర్తి చేసి నివేదికలు సమర్పించడానికి ఏడాదే మిగిలి ఉన్నా.. రాష్ట్రం ఆశించిన పురోగతి సాధించలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గత అక్టోబర్ 17న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) చైర్మన్ అనిల్ జైన్ గురువారం హైదరాబాద్ జలసౌధలో ఈ అంశంపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) అంజాద్ హుస్సేన్, సంబంధిత ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితాలోని అన్ని డ్యామ్‌ల మూల్యాంకనం పూర్తి చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి గడువు పూర్తికానుండగా, ఆలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే, ఏదైనా జరిగితే సంబంధిత డ్యామ్‌ల పర్యవేక్షకులే (సీఈలు) బాధ్యత వహించాల్సి ఉంటుందని తేలి్చచెప్పినట్టు తెలిసింది.
నిధుల కోసం జాబితాలో చెరువులు
డ్యామ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఆయా డ్యామ్‌ల సీఈలు ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత డ్యామ్‌లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించి వాటి భద్రత ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. కేటగిరీ–1లో అత్యవసర మరమ్మతులు జరపకపోతే తక్షణమే విఫలమయ్యే డ్యామ్‌లను, కేటగిరీ–2లో తీవ్రమైన లోపాలు కలిగి ఉండి అత్యవసర మరమ్మతులు అవసరమైన డ్యామ్‌లను, కేటగిరీ–3లో ఏడాదిలోగా స్వల్పమైన మరమ్మతులు అవసరమైన డ్యామ్‌లను చేర్చాల్సి ఉంటుంది. కేటగిరీ–2లోని డ్యామ్‌లకు సత్వరంగా మరమ్మతులు నిర్వహించి కేటగిరీ–3కి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కాగా డ్యామ్‌ల నిర్వచనంతో సంబంధం లేకుండా నిధుల కోసం వాటి పరిధిలోకి రాని బరాజ్‌లు, స్టోరేజీ రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను కూడా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితాలో చేర్చడంతో జాబితా చాంతాడంత అయింది.
ఇప్పుడు తొలగించాలంటూ ప్రతిపాదనలు!
తాజాగా డ్యామ్‌ల నిర్వచనం కింద రాని జలాశయాలను స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితా నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. అత్యవసర మరమ్మతులు అవసరం లేని డ్యామ్‌లను సైతం కేటగిరీ–2 జాబితాలోకి చేర్చడంతో వాటికి సంబంధించిన మూల్యాంకనం నిర్వహించి సత్వరం మరమ్మతులు జరపాలని ఎన్డీఎస్‌ఏ చైర్మన్ సమీక్షలో కోరడం ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది.
మూల్యాంకనంలో ఏం చేయాలి..
చట్టం ప్రకారం స్పెసిఫైడ్ జాబితాలోని ప్రతి డ్యామ్‌కి నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్‌ఎం) మాన్యువల్‌ను తయారు చేయాలి. గరిష్ట వరద ప్రవాహాలకు తగ్గట్టూ డిజైన్లు, నిర్మాణం జరిగిందా? అనే అంశంతో పాటు హైడ్రాలజీకి సంబంధించిన ఇతర అన్ని అంశాలను సమీక్షించాలి. ఏదైన అనుకోని ప్రమాదం జరిగితే విపత్తుల నిర్వహణకు అత్యవసరంగా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి. ముప్పుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం జరపాలి. అన్ని డ్యామ్‌ల భద్రతకు సంబంధించి సమగ్ర పరీక్షలు జరపాలి. భూకంపాల్లాంటి విపత్తులను గుర్తించడానికి డ్యా మ్‌ల వద్ద హైడ్రో–మెటిరోలాజికల్, సీస్మాలజికల్ పరికరాలను ఏర్పాటు చేయాలి. ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఈ విధంగా స్పెసిఫైయిడ్ జాబితాలో చేర్చిన 174 డ్యామ్‌లన్నింటి విషయంలో వచ్చే డిసెంబర్‌లోగా చర్యలు తీసుకోవాలి.
గడువులోగా పూర్తి చేస్తామన్న కార్యదర్శి
తాజా సమీక్షలో ఎన్డీఎస్‌ఏ చైర్మన్ డ్యామ్‌ల వారీగా ఈ ప్రక్రియల్లో సాధించిన పురోగతిని సమీక్షించి.. సంబంధిత ప్రాజెక్టుల సీఈలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలోని 10 డ్యామ్‌లను కేటగిరీ–2 నుంచి కేటగిరీ–3కి మార్చాలని ఆయన సూచించినట్టు తెలిసింది. పెద్దవాగు, జూరాల, రేలంపాడు, మంజీర డ్యామ్‌లకి మరమ్మతుల్లో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా గడువులోగా అన్ని స్పెసిఫైడ్ డ్యామ్‌ల మూల్యాంకనం పూర్తి చేసి నివేదికలు సమరి్పస్తామని శాఖ కార్యదర్శి ఆయనకు హామీ ఇచ్చారు.


