డిజిటల్‌ సేఫ్టీలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ | Telangana Must be Benchmark for Cyber Safety: Sridhar Babu | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ సేఫ్టీలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

Dec 12 2025 6:13 AM | Updated on Dec 12 2025 6:13 AM

 Telangana Must be Benchmark for Cyber Safety: Sridhar Babu

కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్, అమల తదితరులు

విజన్‌ 2047 డాక్యుమెంట్‌లో సమగ్ర రోడ్‌ మ్యాప్‌

పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట 

ఎస్‌సీఎస్‌సీ కాంక్లేవ్‌–2025లో మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను డిజిటల్‌ సేఫ్టీలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047 డాక్యుమెంట్‌లోనూ సమగ్ర కార్యాచరణ ప్రణా ళికను పొందుపర్చామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) కాంక్లేవ్‌–2025ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్‌ నేరగాళ్లు సవాల్‌ విసురుతున్నారని.. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకుపైగా సైబర్‌ దాడులు జరిగాయన్నారు.

తెలంగాణలోని కీలక రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలపై గతేడాది 17 వేలకుపైగా ర్యాన్సమ్‌వేర్‌ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందని చెప్పారు. ఒక్క సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ. 800 కోట్లకుపైగా సొమ్మును సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారని.. ఇలాంటి తరుణంలో సంప్రదాయ పోలీసింగ్‌ కాకుండా స్మార్ట్‌ పోలీసింగ్‌ అవసరమన్నారు. పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని వివరించారు. మోసం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి సైబర్‌ నేరగాళ్లను కట్టడి చేసే వ్యవస్థ అవసరమన్నారు.

కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ డేటా సిస్టమ్స్, రియల్‌ టైం మానిటరింగ్, ఓపెన్‌ ఇన్ఫర్మేషన్‌ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా తమ ప్రభుత్వం పౌరుల డిజిటల్‌ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ వారిని వారియర్స్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) లారా విలియమ్స్, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి, ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ జనరల్‌ రమేశ్‌ ఖాజా తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement