జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లు
మెజారిటీ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు
కాంగ్రెస్-2,440
బీఆర్‌ఎస్-1,132
200కు పైగా స్థానాల్లో బీజేపీ బలపరిచిన వారి గెలుపు
బీజేపీని మించిన స్వతంత్రులు.. ఏకంగా 364 చోట్ల వారే సర్పంచ్‌లు
25 చోట్ల లెఫ్టే ‘రైటు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశలో గురువారం 3,835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు.
ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతు ఇచ్చిన అభ్యర్థులపై విజయం సాధించగా..మరి కొన్నిచోట్ల పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు.
బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మేజర్ పంచాయతీల్లో పరిస్థితి కాస్త పోటీపోటీగా ఉన్నట్లు కనిపించింది.
కాంగ్రెస్ విజయ దుందుభి
మొత్తం 4,236 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 396 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీనితో 3,835 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి..ఏకగ్రీవంగా గెలుపొందిన వారితో కలిపి కాంగ్రెస్ మద్దతు పలికిన వారు 2,440 గ్రామాల్లో సర్పంచ్‌లుగా గెలుపొందారు.

విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని చాలా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు పలికిన వారికే ఓటర్లు పట్టం కట్టినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే కొందరు కార్పొరేషన్ చైర్మన్ల (అధికార పార్టీ నేతలు) గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతు పలికిన వారు విజయం సాధించినట్లు సమాచారం.
సత్తా చాటిన బీఆర్‌ఎస్
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు కూడా గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. గురువారం రాత్రి వరకు 1,132 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపొందింది. స్వతంత్రులు 364 చోట్ల విజయం సాధించగా, బీజేపీ 206 స్థానాల్లో, వామపక్షాలు 25 స్థానాల్లో గెలుపొందాయి. మిగతా చోట్ల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.
చనిపోయినా సర్పంచ్‌గా గెలుపు
ఈ ఎన్నికల్లో 95 సంవత్సరాల వృద్ధుడు సర్పంచ్‌గా ఎన్నికవగా.. మరోచోట ఎన్నికల బరిలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఇంకొన్ని చోట్ల తల్లిపై కూతురు, అత్తపై కోడలు విజయం సాధించిన ఉదంతాలు వెలుగు చూశాయి.
ఈ నెల 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 3,835 సర్పంచ్ స్థానాలతో పాటు 27,628 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరిగాయి.


