ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. నిజాయితీగా వివరాలిచ్చిన ఆ్రస్టేలియన్
ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ప్రవర్తనే మన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. ఆ్రస్టేలియాలోని ఒక పార్కింగ్ స్థలంలో జరిగిన సంఘటన, అక్కడి పౌరుల నైతికతకు అద్దం పట్టింది. ఎవరో ఒక వ్యక్తి, అనుకోకుండా పార్క్ చేసిన కారును ఢీకొట్టాడు. మన ఊహ ప్రకారం.. భయపడిపోవాలి.. పలాయనం చిత్తగించాలి. మౌనంగా ఉండాలి.. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ వ్యక్తి పరారైపోలేదు.
జరిగిన నష్టానికి నైతిక బాధ్యత స్వీకరించాడు. తన పేరు, చిరునామా, బీమా వివరాలను ఒక కాగితంపై రాసి పెట్టాడు. విదేశాల్లోని పౌర స్పృహ, నిజాయితీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన దేవాంగ్ సేథి అనే భారతీయుడు ఈ సంఘటన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
కాగితంపై ఏముంది?
వీడియోలో సేథి మాట్లాడుతూ, తాను ఒక పార్క్‌లో ఉన్నప్పుడు ఈ నోట్‌ను గమనించానన్నారు. ఎవరో ఒక వ్యక్తి అనుకోకుండా మరో కారును ఢీకొట్టాడని తెలిపారు. కానీ ఆయన పారిపోకుండా, కారు యజమాని నష్టపరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా, ఒక కాగితంపై తన పేరు, వాహనం రిజి్రస్టేషన్ నంబర్, ఇన్సూరెన్స్ వివరాలను స్పష్టంగా రాసిపెట్టారని వివరించారు. బీమా సంస్థను ఎలా సంప్రదించాలో కూడా అందులో సూచించారని ప్రశంసించారు. ఆ నోట్‌ను సేథి కెమెరాకు చూపిస్తూ, ఇది బాధ్యతాయుత ప్రవర్తనకు స్పష్టమైన ఉదాహరణని కొనియాడారు.
భారత్‌లో ఊహించగలమా?..
ఈ దృశ్యాన్ని చూసిన సేథి, తాను తరచూ స్వదేశంలో (భారత్‌లో) చూసిన పరిస్థితులతో ఈ సంఘటనను పోల్చారు. ‘భారత్‌లో ఎవరైనా ఇంకొకరి కారును గుద్దితే, వాళ్లు సాధారణంగా అక్కడి నుంచి పారిపోతారు’.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలే.. కొన్ని సమాజాలు ఇతరుల కంటే మెరుగ్గా పనిచేయడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఒక దేశం గొప్పగా మారుతుందంటే, దానికి కారణం అక్కడి మంచి మనుషులు మాత్రమే’.. అని సేథి తన వీడియోను ముగించారు.
పౌర ధర్మంలోనే దేశ వైభవం
నిజాయితీ అనేది అసాధారణ చర్య కాకూడదు, అది సమాజపు ఊపిరి కావాలి. ఈ చిన్న నోట్, కేవలం ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి మాత్రమే కాదు. ఇది బాధ్యత, నైతికత, సామాజిక విలువలపై ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉది్వగ్న చర్చకు తెరలేపింది. కొందరు దీనికి విద్యా వ్యవస్థను, నాయకత్వాన్ని ఆపాదించవచ్చు. కానీ అంతిమ సత్యం ఒక్కటే: ఒక దేశ వైభవం దాని భవంతులలో కాదు, దాని ప్రజల చిన్న చిన్న పౌర ధర్మంలో దాగి ఉంది. చేసిన తప్పును అంగీకరించే ఆ క్షణంలోనే, ఒక దేశపు అంతరాత్మ ప్రతిబింబిస్తుంది. చిన్న నోట్‌తో.. ప్రపంచానికి పాఠం చెప్పిన ఆ్రస్టేలియన్ స్ఫూర్తి ఇది..
– సాక్షి, నేషనల్ డెస్క్


