పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించండి
ఘజియాబాద్: నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగలాని, వారికి పన్ను నిబంధనల అమలును సులభతరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్‌టీ అధికారులకు సూచించారు. అదే సమయంలో పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఘజియాబాద్‌లో సెంట్రల్ జీఎస్‌టీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.
అధికారులపై క్రమశిక్షణ చర్యలను సకాలంలో ముగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తద్వారా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనైతిక, దు్రష్పవర్తనను సహించేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పంపించాలని కోరారు. వేగవంతమైన రిజి్రస్టేషన్‌కు, ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా టెక్నాలజీని వినియోగించుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. టెక్నాలజీ సాయంతో స్మార్ట్ విచారణలు చేయొచ్చు.
అవసరమైతే పన్ను చెల్లింపుదారులను సంప్రదించొచ్చు. అంతేకానీ, ఆ పత్రం ఇవ్వండి, ఈ పత్రం ఇవ్వండి అంటూ పన్ను చెల్లింపుదారులపై భారం వేయొద్దు. వర్తకులకు మీకు మధ్య ఎలాంటి ఉక్కు గోడ లేదు. సమస్యను పెంచడానికి బదులు అది ఎక్కడ ఉందన్నది మీరు అర్థం చేసుకోవాలి. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగాలి. కొత్త తరం జీఎస్‌టీ కింద వారిని గౌరవిస్తున్నట్టు భావించేలా మసులుకోవాలి.
పన్ను చెల్లింపుదారుల్లో ఎవరిలో అయినా నిజాయితీ లోపిస్తే నిబంధనల మేరకు వారిని నిలువరించండి. అంతేకానీ, ప్రతి ఒక్కరినీ అనుమానించొద్దు’’అంటూ మంత్రి జీఎస్‌టీ అధికారులకు హితవు పలికారు. కొత్త జీఎస్‌టీ అన్నది కేవలం రేట్లు, శ్లాబులు, సులభతరానికే పరిమితం కాదంటూ, తమను భిన్నంగా చూస్తున్నారన్న భావన పన్ను చెల్లింపుదారుల్లో కలిగేలా ఉండాలన్నారు.


