
న్యూఢిల్లీ: ప్లేఆఫ్స్ రేసులో ఉన్న తెలుగు టైటాన్స్‌కు వరుస పరాజయాలు కుంగదీస్తున్నాయి. టైబ్రేక్‌కు దారితీసిన గత మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిన తెలుగు టైటాన్స్ గురువారం జరిగిన పోరులో యు ముంబా చేతిలో 26–33తో పరాజయం పాలైంది. టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్, కెప్టెన్ విజయ్ మలిక్ (10) ఒంటరి పోరాటం చేశాడు. రెయిడింగ్‌లో 17 సార్లు కూతకెళ్లి 9 పాయింట్లు తెచ్చాడు.
ప్రత్యర్థి రెయిడర్‌ను టాకిల్ చేసి మరో పాయింట్ సాధించాడు. సహచరుల్లో భరత్ (5) మాత్రమే మెరుగ్గా ఆడాడు. డిఫెండర్లు అంకిత్ 3, అవి దుహన్, శుభమ్ షిండే చెరో 2 పాయింట్లు చేశారు. యు ముంబా తరఫున రెయిడర్ అజిత్ చౌహాన్ (8) రాణించాడు. ఇతనికి సహచరులు సందీప్ (4), రింకూ (4), అమిర్ మొహమ్మద్ (3), పర్వేశ్ (3)లను చక్కని సహకారం లభించింది.
ప్రస్తుతం 8 విజయాలతో మూడో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్‌కు ఈ సీజన్‌లో ఇక మూడే మ్యాచ్‌లు మిగిలున్నాయి. టైటాన్స్ రేపు పుణేరి పల్టన్‌తో పోటీపడుతుంది. అనంతరం 19న గుజరాత్, 22న ఆఖరి పోరులో హరియాణా స్టీలర్స్‌తో తలపడుతుంది.
పాట్నా , హరియాణా గెలుపు
అంతకుముందు హోరాహోరీగా జరిగిన తొలి మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్ టైబ్రేక్‌లో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 32–32 స్కోరుతో సమంగా నిలిచాయి. టైబ్రేక్‌లో పట్నా 6–5తో పైచేయి సాధించింది. పట్నా కెపె్టన్ అయాన్ రెయిడింగ్‌లో చెలరేగాడు. 20 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు పాయింట్లతో వచ్చాడు. మిగతా వారిలో రెయిడర్ అంకిత్ కుమార్ (5), డిఫెండర్ నవ్‌దీప్ (4) రాణించారు.
బెంగళూరు బుల్స్ తరఫున అలీ రెజా మీర్జాయిన్ (17) ఒక్కడే శ్రమించాడు. అనంతరం జరిగిన మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 53–26తో యూపీ యోధాస్‌పై ఘన విజయం సాధించింది. స్టీలర్స్ జట్టులో శివమ్ (15), జైదీప్ (6), సాహిల్ నర్వాల్ (4) రాణించారు. యూపీ తరఫు గగన్ గౌడ (7), భవానీ రాజ్‌పుత్, హితేశ్ చెరో 3 పాయింట్లు చేశారు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్‌తో దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్‌పాంథర్స్‌తో యూపీ యోధాస్ తలపడతాయి.