
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం
17 ఏళ్ల తర్వాత మహిళల సింగిల్స్‌లో భారత్‌కు పతకం
గువాహటి: సుదీర్ఘ నిరీక్షణకు భారత యువ షట్లర్ తన్వీ శర్మ తెర దించించి. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో 17 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ తన్వీ శర్మ 13–15, 15–9, 15–10తో సాకి మత్సుమోటో (జపాన్)పై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో లియు సి యా (చైనా)తో తన్వీ తలపడుతుంది.
ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వాల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ ఉన్నతి హుడాకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో ఉన్నతి 12–15, 13–15తో అన్యాపత్ ఫిచిత్‌ఫోన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ టంకర తలశిల జ్ఞానదత్తుకు కూడా ఓటమి ఎదురైంది. జ్ఞానదత్తు 11–15, 13–15తో మూడో సీడ్ లియు యాంగ్ మింగ్ యు (చైనా) చేతిలో ఓడిపోయాడు.
క్వార్టర్ ఫైనల్లో ఉన్నతి, జ్ఞానదత్తు గెలిచి ఉంటే ఈ ఇద్దరికి కూడా పతకాలు ఖాయమయ్యేవి. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరిగెల భార్గవ్ రామ్–గొబ్బూరు విశ్వతేజ్ (భారత్) జంట 12–15, 10–15తో చెన్ జున్ టింగ్–లియు జున్ రోంగ్ (చైనా) జోడీ చేతిలో... మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భవ్య ఛాబ్రా–విశాఖ టొప్పో (భారత్) ద్వయం 9–15, 7–15తో హుంగ్ బింగ్ ఫు–చౌ యున్ ఆన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలై పతకాలకు దూరమయ్యాయి.