breaking news
World Junior Badminton Championship
-
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తన్వీ శర్మకు రజతం
భారత యువ షట్లర్ తన్వీ శర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. గువాహటిలో జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన్వీ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో టాప్ సీడ్ తన్వీ శర్మ 7–15, 12–15తో రెండో సీడ్ అన్యాపత్ ఫిచిత్‌ఫోన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వాల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. మళ్లీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత తన్వీ శర్మ ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే తన్వీ లయ కోల్పోయింది. ‘చాలా తప్పులు చేశా. మ్యాచ్ ప్రారంభం నుంచే తడబడ్డా. తొలి గేమ్ తర్వాత తేరుకొని... రెండో గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించా. 8–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చేసిన తప్పిదంతో థాయ్ షట్లర్‌కు పట్టుబిగించే అవకాశం దక్కింది. ప్రత్యర్థి నా ఆటతీరును సులువుగా పట్టేసింది’ అని తన్వీ పేర్కొంది. -
తన్వీ తడాఖా...
గువాహటి: సుదీర్ఘ నిరీక్షణకు భారత యువ షట్లర్ తన్వీ శర్మ తెర దించించి. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో 17 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ తన్వీ శర్మ 13–15, 15–9, 15–10తో సాకి మత్సుమోటో (జపాన్)పై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో లియు సి యా (చైనా)తో తన్వీ తలపడుతుంది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వాల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ ఉన్నతి హుడాకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో ఉన్నతి 12–15, 13–15తో అన్యాపత్ ఫిచిత్‌ఫోన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ టంకర తలశిల జ్ఞానదత్తుకు కూడా ఓటమి ఎదురైంది. జ్ఞానదత్తు 11–15, 13–15తో మూడో సీడ్ లియు యాంగ్ మింగ్ యు (చైనా) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఉన్నతి, జ్ఞానదత్తు గెలిచి ఉంటే ఈ ఇద్దరికి కూడా పతకాలు ఖాయమయ్యేవి. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరిగెల భార్గవ్ రామ్–గొబ్బూరు విశ్వతేజ్ (భారత్) జంట 12–15, 10–15తో చెన్ జున్ టింగ్–లియు జున్ రోంగ్ (చైనా) జోడీ చేతిలో... మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భవ్య ఛాబ్రా–విశాఖ టొప్పో (భారత్) ద్వయం 9–15, 7–15తో హుంగ్ బింగ్ ఫు–చౌ యున్ ఆన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలై పతకాలకు దూరమయ్యాయి. -
చరిత్రకు చేరువలో భారత షట్లర్
సాంటెండర్ (స్పెయిన్): మూడు దశాబ్దాల ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో అండర్–19 పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేందుకు తమిళనాడు టీనేజర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ విజయం దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 18 ఏళ్ల శంకర్ 21–13, 21–15తో పనిత్చాపోన్ తీరారత్సకుల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)తో శంకర్ తలపడతాడు. ఫైనల్ చేరే క్రమంలో ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన శంకర్ తన ప్రత్యర్థులకు కేవలం ఒక గేమ్ మాత్రమే కోల్పోయాడు. -
భారత జట్టులో ముగ్గురు తెలంగాణ షట్లర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బృందాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. బాలురు, బాలికల విభాగాల్లో కలిపి మొత్తం 23 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ముగ్గురు తెలంగాణ షట్లర్లకు చోటు దక్కింది. బాలుర విభాగంలో ప్రణవ్ రావు గంధం, నవనీత్ బొక్కా, ఖదీర్ మొయినుద్దీన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నారు. బాలికల విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ ఎంపిక కాలేదు. ఆగస్టులో పంచకుల, బెంగళూరులలో జరిగిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ప్రదర్శన, సాధించిన పాయింట్ల ఆధారంగా భారత జట్టును ఎంపిక చేశారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు రష్యాలోని కజాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. -
సెమీస్‌లో సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ విజయపరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన 15 ఏళ్ల ఈ కుర్రాడు బాలుర సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పెరూలోని లిమా నగరంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో సిరిల్ వర్మ మరోసారి సీడెడ్ క్రీడాకారుడిని బోల్తా కొట్టించి ముందంజ వేశాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ 21-15, 21-14తో పదో సీడ్ సతీస్థరన్ (మలేసియా)పై గెలిచాడు. అంతకుముందు సిరిల్ మూడో రౌండ్లో తొమ్మిదో సీడ్ కాంతాపోన్ వాంగ్చెరన్ (థాయ్‌లాండ్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఆందెర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్)పై సంచలన విజయాలు సాధించాడు.