
భారత యువ షట్లర్ తన్వీ శర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. గువాహటిలో జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన్వీ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో టాప్ సీడ్ తన్వీ శర్మ 7–15, 12–15తో రెండో సీడ్ అన్యాపత్ ఫిచిత్‌ఫోన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వాల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు.
మళ్లీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత తన్వీ శర్మ ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే తన్వీ లయ కోల్పోయింది. ‘చాలా తప్పులు చేశా. మ్యాచ్ ప్రారంభం నుంచే తడబడ్డా. తొలి గేమ్ తర్వాత తేరుకొని... రెండో గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించా. 8–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చేసిన తప్పిదంతో థాయ్ షట్లర్‌కు పట్టుబిగించే అవకాశం దక్కింది. ప్రత్యర్థి నా ఆటతీరును సులువుగా పట్టేసింది’ అని తన్వీ పేర్కొంది.