
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నీలో భారత జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం ఆతిథ్య మలేసియా జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (22వ నిమిషంలో), ఆనంద్ కుష్వాహ (48వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
మలేసియా జట్టుకు నావినేశ్ పానికెర్ (43వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12వసారి ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టు రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరడం విశేషం. శుక్రవారం జరిగిన మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. న్యూజిలాండ్–బ్రిటన్ మ్యాచ్ 2–2 గోల్స్ వద్ద... ఆస్ట్రేలియా–పాకిస్తాన్ మ్యాచ్ 3–3 గోల్స్ వద్ద ‘డ్రా’ అయ్యాయి.
ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. 11 పాయింట్లతో ఆస్ట్రేలియా, 10 పాయింట్లతో భారత్ తొలి రెండు స్థానాల్లో నిలిచి నేడు టైటిల్ పోరులో తలపడతాయి. బ్రిటన్–పాకిస్తాన్ జట్ల మధ్య మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది.