
సాక్షి, హైదరాబాద్: అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి నిరాశ ఎదురైంది. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.
మూడో సీడ్ జాకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) జంటతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో రిత్విక్–అర్జున్ జోడీ 7–6 (7/2), 6–7 (11/13), 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో పోరాడి ఓడిపోయింది. ఒక గంట 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–అర్జున్ రెండు ఏస్‌లుసంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. మ్యాచ్ మొత్తంలో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడం విశేషం.
అయితే ‘సూపర్ టైబ్రేక్’లో జర్మనీ జోడీ పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తొలి రౌండ్‌లో ఓడిన రిత్విక్–అర్జున్ జంటకు 5,740 (రూ. 5 లక్షలు) డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఓటమితో రిత్విక్ సోమవారం విడుదలయ్యే ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు పడిపోయి 70 నుంచి 82వ ర్యాంక్‌కు చేరుతాడు.