
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు పరాజయాల తర్వాత హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు మళ్లీ విజయం రుచి చూసింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 15–13, 20–18, 15–17, 15–9తో గోవా గార్డియన్స్ జట్టును ఓడించింది.
ఈ గెలుపుతో బ్లాక్‌హాక్స్ ఏడు పాయింట్లతో ఆరో స్థానానికి చేరింది. యుదీ యామమోటో, సాహిల్, విటోర్, శిఖర్ సింగ్ స్మాష్‌లతో చెలరేగి బ్లాక్‌హాక్స్‌కు నిలకడగా పాయింట్లు అందించారు. సమష్టిగా రాణించి బ్లాక్‌హాక్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టినందుకు ఆనందంగా ఉందని యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మ్యాచ్ మొత్తంలో బ్లాక్‌హాక్స్ 65 పాయింట్లు నెగ్గగా... ఇందులో సొంత సర్వీస్‌లో 20 పాయింట్లు, స్మాష్‌లతో 27 పాయింట్లు వచ్చాయి.