
మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్‌లో (Sultan of Johor Cup 2025) భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు (Indian Junior Men's Hockey Team) తొలి పరాజయం ఎదురైంది. నిన్న (అక్టోబర్ 15) ఆస్ట్రేలియాతో జరిగిన పూల్ మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 2-4 తేడాతో ఓటమి పాలైంది.
భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ (22వ నిమిషం), అర్ష్‌దీప్ సింగ్ (60వ నిమిషం) గోల్స్ సాధించగా.. ఆస్ట్రేలియా తరఫున ఆస్కార్ స్ప్రౌల్ (39, 42), ఆండ్రూ ప్యాట్రిక్ (40) మరియు కెప్టెన్ డిలన్ డౌనీ (51) గోల్స్ చేశారు.
ఈ మ్యాచ్ తొలి క్వార్టర్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ఆదిలోనే గోల్ కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి గోల్‌ను సేవ్ చేశాడు. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అన్మోల్ ఎక్కా గోల్‌గా మలచలేకపోయాడు. 22వ నిమిషంలో కెప్టెన్ రోహిత్ మ్యాచ్ తొలి గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించాడు.
25వ నిమిషంలో అమీర్ అలీ సోలో రన్‌తో గోల్‌కి ప్రయత్నించగా.. ఆస్ట్రేలియా గోల్‌కీపర్ అద్భతంగా అడ్డుకున్నాడు.
ఆతర్వాత కొద్ది నిమిషాలకే మ్యాచ్ భారత్‌వైపు నుంచి ఆస్ట్రేలియావైపు మళ్లింది. 39 నుంచి 42 నిమిషాల్లోపు ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆఖరి నిమిషంలో (60) అర్షదీప్ సింగ్ అద్భుతమైన డిఫ్లెక్షన్‌తో గోల్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య మలేసియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై భారత సెమీస్ బెర్త్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా, ఓ ఓటమితో 7 పాయింట్లు కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ డ్రాతో 10 పాయింట్లు కలిగి ఉండి టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది.