
ఫ్రిట్జ్, గాఫ్ ముందంజ
యూఎస్ ఓపెన్
న్యూయార్క్: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆశిస్తున్న సెర్బియా దిగ్గజ క్రీడాకారులు నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–4, 6–7 (4/7), 6–2, 6–3తో కామెరాన్ నోరీ (యూకే)పై విజయం సాధించాడు.
ప్రపంచ 35వ ర్యాంకర్ నోరీనుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా...చివరకు జొకోవిచ్ పైచేయి సాధించాడు. మ్యాచ్ మధ్యలో వెన్నునొప్పితో కొంత ఇబ్బంది పడిన జొకోవిచ్ 1991 (జిమ్మీ కానర్స్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన అతి పెద్ద (38) వయస్కుడిగా గుర్తింపు పొందాడు.
2 గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకో 18 ఏస్‌లు సంధించడం విశేషం. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ కూడా ప్రిక్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో ఫ్రిట్జ్ 7–6 (7/3), 6–7 (9/11), 6–4, 6–4తో జెరోమ్ కిమ్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో లోరెంజో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–2, 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఫ్లావియో కొబొలి (ఇటలీ) గాయంతో తప్పుకోవడంతో ముసెట్టి నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
పావొలిని పరాజయం...
మహిళల విభాగంలో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో 6–3, 7–6 (7/2)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)ను ఓడించి సబలెంకా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. నాలుగో సీడ్ పెగులా (యూఎస్) కూడా 6–1, 7–5తో అజరెంకా (రష్యా)ను చిత్తు చేసి ముందంజ వేసింది. వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/4), 6–1తో ఏడో సీడ్ పావొలిని (ఇటలీ)పై సంచలన విజయం సాధించి నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. మూడో సీడ్, అమెరికాకు చెందిన కోకో గాఫ్ కూడా ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. మూడో రౌండ్‌లో గాఫ్ 6–3, 6–1 స్కోరుతో మాగ్దలీనా ఫ్రెంచ్‌ను చిత్తు చేసింది.
పురుషుల డబుల్స్‌లో భారత జోడి అనిరుధ్ చంద్రశేఖర్ – విజయ్ ప్రశాంత్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో చంద్రశేఖర్ – ప్రశాంత్ 3–6, 6–3, 6–4 స్కోరుతో అమెరికా ద్వయం, ఎనిమిదో సీడ్ హారిసన్ – కింగ్‌పై విజయం సాధించారు. అయితే మరో భారత జోడీ ఎన్.బాలాజీ – రిత్విక్ బొల్లిపల్లికి మొదటి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. వాసిల్ కిర్కోవ్ (అమెరికా) – బార్త్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) ద్వయం 3–6, 7–6 (10/8), 6–4 తేడాతో బాలాజీ – రిత్విక్‌ను ఓడించింది.