డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ హస్తగతం
ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రీడాకారిణిగా ఘనత
ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకాపై విజయం
రూ. 46 కోట్ల 40 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
రియాద్ (సౌదీ అరేబియా): ఆద్యంతం నిలకడగా రాణించిన కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ ఎలీనా రిబాకినా కెరీర్‌లో తొలిసారి సీజన్ ముగింపు టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫైనల్స్ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్ రిబాకినాకు టైటిల్ దక్కింది. ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్)తో జరిగిన ఫైనల్లో రిబాకినా 6–3, 7–6 (7/0)తో గెలుపొందింది. ‘ఈ వారం ఎంతో గొప్పగా గడిచింది. టైటిల్ సాధిస్తానని అనుకోలేదు. అంతిమ ఫలితం ఎంతో ఆనందాన్నిస్తోంది’ అని ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరిన తొలిసారే టైటిల్ నెగ్గిన రిబాకినా వ్యాఖ్యానించింది.
టోర్నీ మొత్తంలో అజేయంగా నిలిచిన రిబాకినాకు 52 లక్షల 35 వేల డాలర్ల (రూ. 46 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మహిళల క్రీడా చరిత్రలో ఒక ప్లేయర్‌కు దక్కిన అత్యధిక ప్రైజ్‌మనీ ఇదేనని డబ్ల్యూటీఏ తెలిపింది. రన్నరప్‌గా నిలిచిన సబలెంకా ఖాతాలో 27 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 93 లక్షలు) చేరాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో రన్నరప్‌గా నిలవడం సబలెంకాకిది రెండోసారి.
2022 డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో కరోలినా గార్సియా (ఫ్రాన్స్) చేతిలో సబలెంకా ఓడిపోయింది. ఈసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ ఓడిపోయినప్పటికీ సబలెంకా వరుసగా రెండోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. ఈ ఏడాది సబలెంకా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో కలిపి మొత్తం నాలుగు టైటిల్స్ సాధించింది.
ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 2022 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన రిబాకినా ఈ సీజన్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించనుంది. ఈ సంవత్సరం రిబాకినా 58 మ్యాచ్‌ల్లో గెలిచి, 19 మ్యాచ్‌ల్లో ఓడి మూడు టైటిల్స్‌ను సాధించింది.


