
సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకాపై విజయం
కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి
వింబుల్డన్ టైటిల్ కోసం స్వియాటెక్‌తో తుదిపోరు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) వరుసగా మూడోసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అమెరికా ప్లేయర్ అమండ అనిసిమోవా అద్భుత ఆటతీరు కనబరిచి టాప్ సీడ్ సబలెంకాను బోల్తా కొట్టించింది. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 4–6, 6–4తో సబలెంకాను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
30 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సబలెంకా 37 అనవసర తప్పిదాలు చేసింది. కెరీర్‌లో 22వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన 23 ఏళ్ల అనిసిమోవా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది.
రేపు జరిగే ఫైనల్లో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)తో అనిసిమోవా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ కేవలం 72 నిమిషాల్లో 6–2, 6–0తో బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది.