ప్రిక్వార్టర్ ఫైనల్లో బెలారస్ టెన్నిస్ స్టార్
మూడో రౌండ్‌లో కష్టపడి గెలిచిన నంబర్‌వన్
కోకో గాఫ్, ఆంద్రీవా కూడా ముందంజ
ఏడో సీడ్ పావోలిని అవుట్
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంది. తొలి రెండు రౌండ్‌లలో అలవోకగా నెగ్గిన ఈ మాజీ చాంపియన్‌కు మూడో రౌండ్‌లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రపంచ 55వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/4), 7–6 (9/7)తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా రెండు సెట్‌లను టైబ్రేక్‌లో సొంతం చేసుకోవడం గమనార్హం. మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసిన గత ఏడాది రన్నరప్... 34 విన్నర్స్ కొట్టి 44 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను కూడా నాలుగుసార్లు బ్రేక్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం 17వ సీడ్ విక్టోరియా ఎంబోకో (కెనడా)తో సబలెంకా తలపడుతుంది.
మూడో రౌండ్‌లో ఎంబోకో 7–6 (7/5), 5–7, 6–3తో 14వ సీడ్ క్లారా టౌసన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 2023, 2024లలో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా గత ఏడాది ఫైనల్లో మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు.
మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 3–6, 6–0, 6–3తో హైలీ బాప్టిస్ట్ (అమెరికా)పై, ఆంద్రీవా 6–3, 6–4తో ఎలీనా రూస్ (రొమేనియా)పై, స్వితోలినా 7–6 (7/4), 6–3తో డయానా ష్నయిడర్ (రష్యా)పై గెలుపొందారు. ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) మాత్రం మూడో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. మూడో రౌండ్‌లో పావోలిని 2–6, 6–7 (3/7)తో ఇవా జోవిచ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడిన పావోలిని నాలుగుసార్లు తొలి రౌండ్‌లో, రెండుసార్లు మూడో రౌండ్‌లో, ఒకసారి నాలుగో రౌండ్‌లో నిష్క్రమించింది.
అల్‌కరాజ్ జోరు...
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అల్‌కరాజ్ మరో అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో అల్‌కరాజ్ 6–2, 6–4, 6–1తో కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ 30 విన్నర్స్ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు.
ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను రెండుసార్లు చొప్పున సాధించిన 22 ఏళ్ల అల్‌కరాజ్‌కు ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రం కలిసిరావడం లేదు. ఐదోసారి ఈ టోర్నీలో ఆడుతున్న ఈ స్పెయిన్ స్టార్ గత రెండేళ్లలో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు.
ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అల్‌కరాజ్ విజేతగా నిలిస్తే... ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన అతిపిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా), 10వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 7–5, 4–6, 6–3, 6–1తో కామెరాన్ నోరి (బ్రిటన్)పై, డిమినార్ 6–3, 6–4, 7–5తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై, బుబ్లిక్ 7–6 (7/4), 7–6 (7/5), 6–4తో టొమాస్ ఎచ్‌వెరీ (అర్జెంటీనా)పై, మెద్వెదెవ్ 6–7 (5/7), 4–6, 7–5, 6–0, 6–3తో ఫాబియన్ మరోజ్‌సన్ (హంగేరి)పై గెలిచారు. 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 3–6, 6–7 (4/7), 3–6తో ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు.


