
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ
హోరాహోరీ సెమీఫైనల్స్‌లో పోరాడి ఓడిన జెస్సికా పెగూలా, నయోమి ఒసాకా
న్యూయార్క్: కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించేందుకు సబలెంకా (బెలారస్)... కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకునేందుకు అమండ అనిసిమోవా (అమెరికా) ఒక్క విజయం దూరంలో ఉన్నారు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సబలెంకా, అనిసిమోవా ఫైనల్లోకి దూసుకెళ్లారు.
శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా 4–6, 6–3, 6–4తో నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై నెగ్గగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అనిసిమోవా 6–7 (4/7), 7–6 (7/3), 6–3తో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత, ప్రపంచ 24వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్)లపై విజయం సాధించారు. సబలెంకా, అనిసిమోవా మధ్య ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి గం. 1:30 నుంచి జరుగుతుంది.
ముఖాముఖి రికార్డులో అనిసిమోవా 6–3తో సబలెంకాపై ఆధిక్యంలో ఉంది. 27 ఏళ్ల సబలెంకా తన కెరీర్‌లో ఇప్పటి వరకు మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్), యూఎస్ ఓపెన్ (2024) సాధించి... మూడుసార్లు రన్నరప్‌గా (2025 ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్; 2023 యూఎస్ ఓపెన్) నిలిచింది. మరోవైపు అనిసిమోవా తన కెరీర్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే ఫైనల్ (ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ) చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
గత ఏడాది జెస్సికాను ఓడించి యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈసారి సెమీఫైనల్లోనే అమెరికా ప్లేయర్ ఆట కట్టించింది. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయినా కంగారు పడలేదు. పట్టుదలతో ఆడి ఆ తర్వాత వరుసగా రెండు సెట్‌లు గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన ఈ బెలారస్ స్టార్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు నెగ్గిన సబలెంకా 43 విన్నర్స్ కొట్టింది.
మరోవైపు జెస్సికా మూడు ఏస్‌లు కొట్టి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 15 అనవసర తప్పిదాలు చేసింది. నయోమి ఒసాకాతో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అనిసిమోవా ఏడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 50 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా 45 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ఒసాకా 15 ఏస్‌లు సంధించినా, కేవలం 32 విన్నర్స్‌తో సరిపెట్టుకుంది.
2 యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండు సెమీఫైనల్స్ విజేతలు తొలి సెట్‌ను కోల్పోయి నెగ్గడం ఇది రెండోసారి మాత్రమే. 1993లో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) 4–6, 6–1, 6–0తో మలీవా (స్విట్జర్లాండ్)పై; హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (7/9), 7–5, 6–2తో అరంటా శాంచెజ్ వికారియో (స్పెయిన్)పై గెలిచారు.