
మూడో రౌండ్‌లోకి మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్
శ్రమించి గెలిచిన రెండో సీడ్ స్వియాటెక్
అల్‌కరాజ్, జొకోవిచ్ జోరు
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/4), 6–2తో పొలీనా కుదెర్‌మెటోవా (రష్యా)పై విజయం సాధించింది. 96 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు నాలుగుసార్లు దూసుకొచ్చి రెండుసార్లు పాయింట్లు గెలిచింది. 18 విన్నర్స్ కొట్టిన ఆమె 22 అనవసర తప్పిదాలు చేసింది.
తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన ఈ బెలారస్ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. సుజాన్ లామెన్స్ (నెదర్లాండ్స్)తో 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ 6–1, 4–6, 6–4తో కష్టపడి గెలిచింది.
పెగూలా 6–1, 6–3తో బ్లింకోవా (రష్యా)పై, రాడుకాను 6–2, 6–1తో జానైస్ జెన్ (ఇండోనేసియా)పై, పావోలిని 6–3, 6–3తో ఇవా జోవిక్ (అమెరికా)పై విజయం సాధించారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–1, 6–3తో పొటపోవా (రష్యా)పై, పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) 6–2, 6–1తో మెక్‌నాలీ (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 7–6 (9/7)తో తెరెజా వాలెన్‌టోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొంది మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 16వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) 3–6, 3–6తో ఆన్ లీ (అమెరికా) చేతిలో, 17వ సీడ్ సమ్సోనోవా (రష్యా) 6–4, 3–6, 2–6తో ప్రిసిల్లా హాన్ (ఆ్రస్టేలియా) చేతిలో, 25వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాతి్వయా) 5–7, 1–6తో టేలర్ టౌన్‌సెండ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు.
11వ సీడ్ రూనె ఓటమి
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్‌కరాజ్ (స్పెయిన్), మాజీ విజేత జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... 11వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్‌కరాజ్ 6–1, 6–0, 6–3తో మటియా బెలూచి (ఇటలీ)పై, జొకోవిచ్ 6–7 (5/7), 6–3, 6–3, 6–1తో జచారీ వజ్దా (అమెరికా)పై గెలుపొందారు.
రూనె 6–7 (5/7), 6–2, 3–6, 6–4, 5–7తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 4–6, 7–6 (7/3), 6–2, 6–4తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై, ఆరో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6–4, 6–2, 6–4తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–4, 6–0, 6–2తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించారు.