తొలి రౌండ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్‌పై విజయం
సార్‌బ్రుకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 48వ ర్యాంకర్ శ్రియాన్షి 21–19, 21–12తో ప్రపంచ 21వ ర్యాంకర్, మూడో సీడ్ లైన్ హోమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఉన్నతి హుడా 21–4, 21–14తో జూలియానా (బ్రెజిల్)పై, రక్షిత శ్రీ 21–14, 21–16తో క్లారా అజుర్మెండి (స్పెయిన్)పై గెలుపొందగా... అన్‌మోల్ 24–26, 21–23తో జూలీ (డెన్మార్క్) చేతిలో... అనుపమ 19–21, 19–21తో పొలీనా (ఉక్రెయిన్) చేతిలో... తాన్యా 14–21, 13–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు.
శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే...
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జితో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 19–21, 11–21తో ఓడిపోయాడు. భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ 21–16, 22–20తో ప్రపంచ 7వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. మరో మ్యాచ్‌లో శంకర్ ముత్తుస్వామి (భారత్) 21–14, 18–21, 21–16తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను ఓడించాడు.


