భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు (PV Sindhu) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు తెలిపింది. గాయం బెడద కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటన విడుదల చేసింది.
కీలక టోర్నీలకు పీవీ సింధు దూరం
కాగా గత రెండు నెలలుగా కీలక టోర్నీలకు పీవీ సింధు దూరంగానే ఉంది. ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో మేజర్ టోర్నీలను మిస్ అయింది. చివరగా చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సింధు.. ఆ తర్వాత పాదం నొప్పి (Foot Injury) కారణంగానే మరే టోర్నీల్లోనూ సింధు ఆడలేకపోయింది.
ఇదే వాస్తవం
ఈ క్రమంలోనే 2025 సీజన్‌ను ముందుగానే ముగించాలని పీవీ సింధు నిర్ణయించుకుంది. ఈ మేరకు.. ‘‘యూరోపియన్ లెగ్‌కు ముందు మడిమకు గాయమైంది. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అథ్లెట్ల కెరీర్‌లో గాయాలు భాగం. ఈ విషయాన్ని అంత తేలికగా అంగీకరించలేము. కానీ ఇదే వాస్తవం.
క్రీడాకారుల సామర్థ్యం, ఓపికను గాయాలు పరీక్షిస్తూ ఉంటాయి. అయితే, అంతే వేగంగా.. మరింత బలంగా తిరిగి రావాలనే కసిని కూడా రగిలేలా చేస్తాయి. కోలుకునే ప్రక్రియ కొనసాగుతోంది.
బలంగా తిరిగి వస్తా
డాక్టర్ వైన్ లామ్‌బార్డ్, నిషా రావత్, చేతన పర్యవేక్షణలో.. నా కోచ్ ఇర్వాన్‌స్యా మార్గదర్శనం.. నా టీమ్ సహాయంతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నా. వారి నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తోంది.
మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు పట్టుదలగా ఉన్నా. నాపై ప్రేమను కురిపిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు. మాటల్లో చెప్పలేని భావన ఇది. నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది’’ అని పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
కాగా ముప్పై ఏళ్ల సింధు గత నాలుగేళ్లలో ఇలా సీజన్‌ను ముందుగానే ముగించడం ఇది మూడోసారి. 2022 కామన్‌వెల్త్ గేమ్స్ సమయంలోనూ సింధు గాయపడింది. ఇక ఐదుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో మెడల్ గెలిచిన సింధు.. మూడేళ్ల తర్వాత 2024లో తొలి టైటిల్ గెలిచింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300లో విజేతగా నిలిచింది. కానీ ఈ ఏడాది ఈ టోర్నీలో సింధు కార్టర్ ఫైనల్ దాటి ముందుకు వెళ్లలేకపోయింది.
వైవాహిక జీవితంలో..
కాగా సింధు గతేడాది డిసెంబరులో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో సింధు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఏడడుగులు వేసింది. భర్త ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న సింధు.. గాయం కారణంగా ఈసారి సీజన్‌ను ముందుగానే ముగించినా.. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలని పట్టుదలగా ఉంది.
ఇక రియో ఒలింపిక్స్-2016లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రజతం గెలిచిన సింధు.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!
🙏❤️ pic.twitter.com/oiZLLl2TPj
— Pvsindhu (@Pvsindhu1) October 27, 2025


