భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు. తాను కోలుకుంటున్నానని.. ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలిపాడు. అదే విధంగా.. తన క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. కష్టకాలంలో అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, అభిమానులకు రుణపడి ఉంటానన్నాడు.
ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా శ్రేయస్ అయ్యర్ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్‌లో మాత్రం అర్ధ శతకం (61)తో ఆకట్టుకున్నాడు.
నొప్పితో విలవిల్లాడుతూ
ఈ క్రమంలో సిడ్నీలో ఆఖరిదైన మూడో వన్డే (IND vs AUS 3rd ODI)లోనూ సత్తా చాటాలని భావించిన శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా ఫీల్డింగ్ చేస్తుండగా.. అలెక్స్ క్యారీ (Alex Carey) ఇచ్చిన క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు.
నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కూలిపోగా.. ఫిజియో వచ్చి అయ్యర్‌ను తీసుకువెళ్లాడు. తొలుత గాయం చిన్నదనే భావించినా డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లిన తర్వాత అయ్యర్ స్పృహ తప్పి పడిపోయినట్లు తెలిసింది. వెంటనే ఫిజియో, డాక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడిని సిడ్నీ ఆస్పత్రికి తరలించారు.
Shreyas SUPERMAN Iyer! 💪
Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025
అంతర్గత రక్తస్రావం
ఈ క్రమంలో పక్కటెముకల గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి అతడికి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కారణంగా అదృష్టవశాత్తూ అయ్యర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. త్వరలోనే అతడు డిశ్చార్జ్ కూడా కానున్నట్లు సమాచారం.
గాయం తర్వాత తొలి స్పందన.. పోస్ట్ వైరల్
ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ తొలిసారిగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చాడు. ఈ మేరకు.. ‘‘కోలుకునే దశలో ఉన్నాను. రోజురోజుకీ పరిస్థితి మెరుగుపడుతోంది. నా కోసం ప్రార్థిస్తూ.. నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
కష్టకాలంలో నాకు దక్కిన ఈ మద్దతు ఎప్పటికీ మర్చిపోలేనిది. నా కోసం ప్రార్థించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని అయ్యర్ ప్రకటన విడుదల చేశాడు.
ఆటకు దూరం
కాగా ముంబైకి చెందిన 30 ఏళ్ల శ్రేయస్ అయ్యర్.. వెన్నునొప్పి సమస్య కారణంగా ఇటీవలే టెస్టులకు సుదీర్ఘ విరామం ప్రకటించాడు. టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోతున్న అయ్యర్.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.
తాజా గాయం వల్ల దాదాపు రెండు నుంచి మూడు నెలలపాటు అతడు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా వన్డేల్లో ఆతిథ్య ఆసీస్‌ను టీమిండియాను 2-1తో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిపోయింది.


