మహిళల బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న చైనీస్ తైపీ స్టార్ తై జు–యింగ్ (టీటీవై) తన కెరీర్‌ను ముగించింది. గత ఏడాది కాలంగా వరుస గాయాలతో బాధపడుతున్న ఆమె 31 ఏళ్ల వయసులో ఆటనుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది.
‘జీవితంలో అన్నీ ఇచ్చినందుకు బ్యాడ్మింటన్‌కు కృతజ్ఞతలు. ఒక అద్భుత అధ్యాయం ముగింపునకు వచి్చంది. నా గాయాలే నన్ను ఆటనుంచి తప్పుకునేలా చేశాయి. వరుసగా శస్త్ర చికిత్సలు, రీహాబిలిటేషన్ బాగా ఇబ్బంది పెట్టాయి.
భవిష్యత్తు గురించి నిర్ణయించుకోలేదు కానీ ప్రస్తుతానికి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. టీటీవై అందరికీ గుర్తుండిపోవాలని ఆశిస్తున్నా’ అని రిటైర్మెంట్ ప్రకటనలో తై జు వెల్లడించింది.
ఘనమైన రికార్డులు...
తైజు సుదీర్ఘ కెరీర్‌లో ప్రతిష్టాత్మక విజయాలన్నీ ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం, కాంస్యంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో 4 స్వర్ణాలు, కాంస్యం ఆమె ఖాతాలో ఉన్నాయి.
2009లో ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకొని తొలిసారి గుర్తింపులోకి వచ్చిన తై జు ఆ తర్వాత సీనియర్ స్థాయిలో వరుస విజయాలతో శిఖరానికి చేరింది. రికార్డు స్థాయిలో నాలుగు సార్లు బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఈ తైవాన్ షట్లర్ ఆల్ ఇంగ్లండ్ టోర్నీని 3 సార్లు గెలుచుకుంది.
కెరీర్‌లో 17 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ గెలిచిన ఆమె మరో 12 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 22 ఏళ్ల వయసులో తొలి సారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న తై జు ఓవరాల్‌గా 214 వారాల పాటు అగ్రస్థానాన నిలవడం విశేషం.


