
చైనా ఓపెన్‌లో ఆతిథ్య షట్లర్ల హవా
నాలుగు విభాగాల్లో టైటిల్స్ సొంతం
చాంగ్జౌ: బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ చైనా ఓపెన్‌లో చైనా క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం ఐదు విభాగాలకుగాను నాలుగు విభాగాల్లో టైటిల్స్ దక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో చైనా క్రీడాకారులే ఫైనల్ చేరుకున్నారు. ఫలితంగా విన్నర్స్, రన్నరప్‌గా చైనా ప్లేయర్లే నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యు కి (చైనా) 64 నిమిషాల్లో 14–21, 21–14, 21–15తో ప్రపంచ 23వ ర్యాంకర్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)పై గెలిచాడు.
మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) 39 నిమిషాల్లో 21–8, 21–13తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జోడీ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) 69 నిమిషాల్లో 24–22, 17–21, 21–14తో ప్రపంచ ఏడో ర్యాంక్ జాంగ్ షు జియాన్–జియా యి ఫాన్ (చైనా) ద్వయంపై నెగ్గింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ 47 నిమిషాల్లో 23–21, 21–17తో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)పై గెలుపొందింది.
పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ 210వ ర్యాంక్ జోడీ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా) ద్వయం 21–15, 21–14తో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై సంచలన విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 1,40,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 21 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విజేత జోడీలకు 1,48,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 28 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.