నాగోలులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయం
మన్సూరాబాద్: చైనా మాంజాపై నగరంలో నిషేధం ఉన్నా విక్రయాలు మాత్రం తగ్గడంలేదు. నాగోలు ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఘటనలో బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డారు. హస్తినాపురం వందనపురి కాలనీకి చెందిన చీల రాజశేఖర్ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో నాగోలు ఫ్లైఓవర్ వద్ద గాలిపటాల చైనా మాంజా నేరుగా ఆయన ముఖానికి చుట్టుకుంది. కత్తిలా పదునైన చైనా మాంజా ఒక్కసారిగా ముఖాన్ని చీల్చడంతో రాజశేఖర్ ముక్కుపై లోతుగా కోసుకుపోయి భారీ గాయంతో తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడు అప్రమత్తమై వాహనాన్ని పక్కకు నిలిపివేశాడు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


