మూసాపేట (హైదరాబాద్): చైనా మాంజాకు ఓ నిండు ప్రాణం బలైంది. తల్లిదండ్రులతో సంతోషంగా బైక్‌పై వెళుతున్న ఓ చిన్నారి గొంతుకు చైనా మాంజా తగిలి గొంతు తెగటంతో మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోనసీమ, అంబాజీపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామ్‌సాగర్, పద్మావతిలు కేపీహెచ్‌బీ కాలనీలోని గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె నిష్విక దర్యా (4) లండన్ కిడ్స్ స్కూలులో ఎల్‌కేజీ చదువుతోంది. వీరు ఇటీవల కాజీపల్లిలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు.
సోమవారం సెలవు కావటంతో తమ కొత్తింట్లో జరుగుతున్న ఇంటీరియర్ పనులను చూసేందుకు కుటుంబ సభ్యులు బైక్‌పై వెళ్లి వస్తున్నారు. కూకట్‌పల్లి, వివేకానందనగర్‌లో పిల్లర్ నంబర్ 781 వద్ద డివైడర్ పక్క నుంచి వస్తుండగా పాప ఒక్కసారిగా గట్టిగా అరిచింది. తండ్రి వెంటనే వాహనాన్ని ఆపి చూడగా పాప గొంతు నుంచి రక్తం కారుతోంది. రక్తాన్ని చూసి తండ్రి అక్కడే పడిపోయాడు. పాప మెడకు మాంజా దారం చిక్కుకుని ఉండటాన్ని గమనించి వెంటనే మాంజాను తొలగించారు. అటు నుంచి బైక్‌పై వెళుతున్న మరో వ్యక్తి పాపను బైక్‌పై సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.
గొడవపడి.. బైక్ ముందు కూర్చుని..
కాజిపల్లి నుంచి బయలుదేరేటప్పుడే తన అక్కతో ముందు నేను కూర్చుంటానని గొడవపడి నిష్విక ముందు కూర్చుంది. జేఎన్‌టీయూ వద్ద యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ చాలా ముందుకు వచ్చారు. పిల్లర్ నంబర్ 781 వద్ద పాప గొంతుకు మాంజా తగిలింది. వాహనం ఆపడానికి వీల్లేక పోవడం.. అలాగే ముందుకు రావటంతో పాప గొంతు లోతుగా తెగింది. కాగా, తీవ్రంగా రక్తస్రావం కావడంతోనే పాప చనిపోయిందని వైద్యులు రఘురాం తెలిపారు. మెదడు నుంచి గుండెకు, గుండె నుంచి మెదడుకు రక్తాన్ని పంపు చేసే రెండు ప్రధాన నరాలు గొంతులో తెగిపోయాయని ఆయన చెప్పారు.
కేసు ఎవరి మీద?
జేఎన్‌టీయూ వద్దే యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని పాప తల్లిదండ్రులు రోదించారు. కూకట్‌పల్లి పోలీసులు పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం చోటు చేసుకుందంటూ బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడిగా చేరుస్తూ.. కేసు ఫైల్ చేశారు. ఈ మాంజా కలిగిన పతంగిని ఎవరు ఎగురవేశారనేది గుర్తించడం కష్టమని ఈ సందర్భంగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది చైనా మాంజా కారణంగా సంభవించిన మరణాల్లో ఇది రెండోదని గుర్తు చేశారు.


